Sankranthi Special : సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా.. ఇళ్లు జాగ్రత్త

Sankranthi Special : సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా.. ఇళ్లు జాగ్రత్త

సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా.. అయితే, ఈ విషయం మీ కోసమే. తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊరెళ్లే ముందు మీ నగలు, నగదును భద్రపర్చుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ పోలీసులు గుర్తు చేస్తున్నారు. కచ్చితంగా మీ పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని, లేదంటే.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూకట్ పల్లి ఏసీపీ శివ భాస్కర్ సూచించారు. కూకట్ పల్లి ఏసీపీ పరిధిలోని కేపిహెబీ, కూకట్ పల్లి, బాచుపల్లి పోలీస్ స్టేషన్ ల పరిధిలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు.

గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేదానిపై పోలీసులు పోస్టర్ ను విడుదల చేశారు. సంక్రాంతి పండక్కి దూర ప్రాంతాలకు, సొంతూళ్లకు వెళ్లే ప్రజలు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్ లో తప్పకుండా తెలియజేయాలని ఆయన కోరారు.