
మద్యం మత్తులో పోలీస్ వ్యాన్ నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన ఎల్ బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. దీంతో అక్కడ ట్రాఫిక్ స్థంభించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అవినాష్ తివారీ అంబర్ పేట ఎస్పీడీ కార్ హెడ్ క్వాటర్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం సరూర్ నగర్ఇండోర్ స్టేడియంలో ఎన్నికల విధుల నిమిత్తం టీఎస్09 పీబీ 0931 పోలీస్ వాహనం నడిపిస్తూఎల్బీనగర్ డీవీఎం కాలేజీ నుంచి కామినేని వైపువెళ్తున్నాడు. మార్గ మధ్యలో శ్రీ శంకర్ కాలనీకి చెందిన సిరికొండ బాల్ రాజు బైక్ పై వెళుండగా ఢీ కొట్టాడు. అతడికి తీవ్రగాయాలైనా వాహనాన్ని ఆపకుండా తివారీ ముందుకు పోనిచ్చాడు. ఈక్రమంలో మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో స్థానికులు వెంబడించి అడ్డుకుని తివారిని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. అప్పటికే తివారీ పీకలదాకా మందుతాగి ఉన్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయగా 90శాతం మద్యం సేవించినట్లు తేలింది. అతడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన వ్యక్తిని కామినేని ఆస్పత్రికి తరలించారు.