డీఎంకేతో అన్నా డీఎంకే పొత్తు?..ప్రభుత్వ ఏర్పాటుపై రహస్య చర్చలు జరిపినట్టు వార్తలు

డీఎంకేతో అన్నా డీఎంకే పొత్తు?..ప్రభుత్వ ఏర్పాటుపై రహస్య చర్చలు జరిపినట్టు వార్తలు

తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు తమ వైరాన్ని పక్కన పెట్టి పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. 

సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీని అధికారానికి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీల మధ్య రహస్య చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59 స్థానాలు, ఏఐఏడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసినా మొత్తం సంఖ్య 106 వద్దే నిలిచిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ 118ని చేరుకోవాలంటే వీరికి మరో 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 

ఈ నేపథ్యంలో..విజయ్ హవాను అడ్డుకోవడానికి చిన్న పార్టీలను కలుపుకొని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై చర్చలు సాగుతున్నాయి. ‘‘ప్రజాస్వామ్యానికి మేలు చేసే వార్త త్వరలోనే వింటారు” అంటూ డీఎంకే నేత  హఫీజుల్లా చేసిన ట్వీట్ ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.