కంటోన్మెంట్ బోర్డుపై  పొలిటికల్ ​ఫోకస్​

కంటోన్మెంట్ బోర్డుపై  పొలిటికల్ ​ఫోకస్​

సికింద్రాబాద్​,వెలుగు : గ్రేటర్​ ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పడు అన్ని రాజకీయ పార్టీలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుపై ఫోకస్​ పెట్టాయి. బోర్డు పదవీకాలం యేడాది కిందటే ముగిసింది. కానీ  పలు వివాదాల కారణంగా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. రెండు పర్యాయాలు పెంచిన గడువు కాలం కూడా త్వరలో పూర్తి కానుంది. కేంద్ర హోం శాఖ నుంచి  ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్​రావొచ్చనే ఆసక్తితో నేతలు ఎదురు చూస్తున్నారు. కంటోన్మెంట్​బోర్డు పరిధిలోని మొత్తం ఎనిమిది వార్డుల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.  డ్రైనేజీ , వాటర్​ పైపులైన్​, సీసీ రోడ్డు , రోడ్ల మరమ్మతు పనులను స్పీడ్​గా చేస్తున్నారు.

బోర్డుపై టీఆర్​ఎస్ ఫోకస్​​

ఇటీవల జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో  మెజార్టీ సీట్లు సాధించిన టీఆర్​ఎస్​  కంటోన్మెంట్‌‌‌‌లో కూడా కేడర్​ను పటిష్టం చేసేందుకు వార్డు సభ్యులతో పాటు కేబినెట్​మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్​,    మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్న  వంటి ప్రముఖులు  పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలకు హాజరవుతున్నారు.వార్డుల్లో పలు సమావేశాలు నిర్వహిస్తూ చేపడుతున్న డెవలప్​మెంట్​ను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వం కంటోన్మెంట్​బోర్డుకు బకాయిపడిన రూ.80కోట్ల  ప్రాపర్టీ ట్యాక్సు  నుంచి రూ.20 కోట్లు ఇటీవలే రిలీజ్​ చేసింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని బోర్డు అధికారులు  ఒక్కో వార్డుకు రూ.2కోట్లు మంజూరు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం  మంత్రి మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఒకటో వార్డులో రూ.19లక్షలలో  సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు అంచనాలు 

బోర్డు పరిధిలో అభివృద్ధి పనులు, వాటికి  అయ్యే ఖర్చు అంచనాలను  బోర్డు అధికారులు  ప్రిపేర్​ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస సదుపాయాల కల్పనకు రిపోర్ట్​లు రూపొందిస్తున్నారు.  ఇటీవల కురిసిన వర్షాలకు పాడై పోయిన  ఓపెన్​ నాలాల  ప్రాంతాల్లో రిటైనింగ్​వాల్వ్​ల నిర్మాణం, వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టులకు మరమ్మతు పనులు చేపట్టేందుకు నివేదికలు రెడీ చేస్తున్నారు.   ఈ నెలాఖరులో జరిగే బోర్డు మీటింగ్​లో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్​గా ప్రజలు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా  ఇక్కడి సమస్యలు పట్టించుకోని ప్రజా ప్రతినిధులు ఇప్పుడు హడావిడిగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని, ఇదంతా కేవలం ఓట్లను రాబట్టుకునేందుకు జరిగే జిమ్మిక్కులేనని ప్రజలు చెబుతున్నారు.

ఎలాంటి అభివృద్ధి లేదు

కంటోన్మెంట్​ బోర్డులో అతిపెద్దదైన ఐదో వార్డులో ఎలాంటి అభివృద్ధి లేదు.  వార్డు పరిధిలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుత బోర్డు ఉపాధ్యక్షుడు  ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులోనే ప్రాబ్లమ్స్​ ఉన్నాయి. ఇప్పటికైనా వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలి.  కంటోన్మెంట్​లో నీటి బిల్లులు అధికంగా వస్తున్నాయి.  జీహెచ్​ఎంసీలో విలీనం చేసినపుడే సమస్యలు తీరుతాయి. – తేలకుంట సతీష్​గుప్తా, వాసవి నగర్​ సంక్షేమ  సంఘం అధ్యక్షుడు