పాలిటెక్నిక్ ఫీజులపై గందరగోళం .. నిలిచిన పాలిసెట్ సీట్ల కేటాయింపు

పాలిటెక్నిక్ ఫీజులపై గందరగోళం .. నిలిచిన పాలిసెట్ సీట్ల కేటాయింపు
  • రెండు, మూడు రోజుల్లో క్లారిటీ 
  • గత నెల 24 నుంచి మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ 
  • వెబ్​ ఆప్షన్స్ ఇచ్చిన 24వేల మంది​
  • త్వరలో సీట్ల అలాట్‌‌‌‌మెంట్​ చేస్తామని ఎస్‌‌‌‌బీటెట్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్​ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫీజులపై స్పష్టత కరువైంది. దీంతో పాలిసెట్ సీట్ల అలాట్‌‌‌‌మెంట్​ ప్రక్రియ నిలిచిపోయింది. విద్యార్థుల్లో అయోమయం నెలకొనగా.. త్వరలోనే సీట్ల అలాట్‌‌‌‌మెంట్​చేస్తామని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌‌‌‌బీటెట్) ప్రకటించింది.  మే13న పాలిసెట్ ఎగ్జామ్ నిర్వహించగా,  98,858 మంది అటెండ్ అయ్యారు. గతనెల 24 నుంచి పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 24 వేల మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న సీట్ల అలాట్‌‌‌‌మెంట్​ చేయాలి. కానీ, ఫీజులపై స్పష్టత రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిపివేశారు. 

ఫీజులపై స్పష్టత లేకపోవడంతోనే..

రాష్ట్రంలో 59 గవర్నమెంట్​ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. ఇందులో 12,882 సీట్లున్నాయి. 55 ప్రైవేట్​ కాలేజీల్లో 30,890 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం గవర్నమెంట్ కాలేజీల్లో రూ.3,800, ప్రైవేట్​ కాలేజీల్లో రూ.15వేల ఫీజు ఉన్నది. ఈ ఫీజులను 2010లో నిర్ణయించారు. దీనిపై మేనేజ్‌‌‌‌మెంట్స్​ ఆందోళన నేపథ్యంలో టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ  ద్వారా ఫీజులను లెక్కించారు. మొత్తం రూ. 39 వేల వరకు ఉండాలని సర్కారుకు నిరుడు ప్రతిపాదనలు పంపించారు. అయితే,  ఏ కేటగిరీ వారికి  ఎంతెంత అనేదానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో విద్యా, ఆర్థిక శాఖల నుంచి అధికారులు వివరాలు కోరారు.  ఆయా శాఖల నుంచి స్పష్టత రాకపోవడంతో పాలిసెట్​ సీట్​ అలాట్‌‌‌‌మెంట్‌‌‌‌ను నిలిపేశారు.  

దాదాపు అన్ని కాలేజీల్లోనూ రూ.37 వేలు, రూ. 39 వేలుగా ఫీజు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే,  ప్రైవేట్​ కాలేజీల్లోనూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఉచితంగానే విద్యనందించాలి.  మిగిలిన బీసీ, ఓసీ విద్యార్థులు, సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులకు ఏమైనా రాయితీ ఉంటుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంజినీరింగ్ ఫీజుల మాదిరిగానే.. పాలిసెట్‌‌‌‌లోనూ కొన్ని ర్యాంకుల వరకు పూర్తిగా, మిగిలిన ర్యాంకుల వారికి కొంత ప్రభుత్వం, కొంత విద్యార్థులు కట్టుకునేలా ఫీజులు నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, రెండు, మూడు రోజుల్లోనే దీనిపై క్లారిటీ రానున్నదని, ఆ తర్వాతే సీట్ల అలాట్‌‌‌‌మెంట్​ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.