
హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రాకముందే.. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ స్లాట్ బుకింగ్ గడువు ముగిసింది. మరోపక్క టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల గాకముందే పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఇంటర్, టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఆగస్టు 21 నుంచి ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ మొదలైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఈనెల 29వ తేదీతో స్లాట్ బుకింగ్ ప్రక్రియ ముగిసింది. 30తో సర్టిఫికెట్ల ప్రక్రియ ముగియనుంది. అయితే రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి10 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. దీంట్లో సెకండియర్ స్టూడెంట్లు 1.13 లక్షల మంది అటెండ్ అయ్యారు. మెజార్టీ స్టూడెంట్స్ ఎంపీసీ వారే.
పాలిసెట్ చాన్స్ మిస్
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆగస్టు 1–10 మధ్య జరిగాయి. 55వేల మంది అటెండ్ అయ్యారు. టెన్త్ పాసైన స్టూడెంట్సే.. పాలిసెట్‌కు అర్హులు. సప్లిమెంటరీ రాసిన వారు పాలిసెట్ ఎగ్జామ్ రాశారు. సప్లిమెంటరీ స్టూడెంట్స్‌ను పట్టించుకోకుండానే పాలిసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేశారు. స్పాట్ అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్అయ్యింది. పాలిసెట్ చేయాలనుకున్న టెన్త్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థులకు ఆ చాన్స్ లేకుండా పోయింది. సప్లిమెంటరీ రిజల్ట్స్ పది రోజుల్లోనే ఇచ్చే చాన్స్ ఉన్నా.. పరీక్షల విభాగం అధికారులు పట్టించుకోలేదని స్టూడెంట్స్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇంటర్లో మూడున్నర లక్షల మంది రిజల్ట్స్ మంగళవారం రిలీజ్ చేస్తున్నా, టెన్త్‌లో 55వేల మంది రాసిన ఫలితాలు ఎప్పుడు ఇస్తారో కూడా స్పష్టత లేకుండా పోయింది.
ఇయ్యాల్నే ఇంటర్ సప్లి రిజల్ట్స్!
వ్యాల్యుయేషన్ ముగిసింది. రిజల్ట్ ప్రాసెస్ కొనసాగుతున్నది. పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడంతో 30న ఫలితాలు ఇస్తామని సోమవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. సోమవారంతోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ గడువు ముగియడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చినా, ఇంటర్ ఫలితాల ఆలస్యం కారణంగా పేరొందిన ఇంజనీరింగ్ కాలేజీలు మిస్ అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యామండలి మధ్య సమన్వయ లోపంతో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో అటెండ్ కాలేని పరిస్థితి నెలకొన్నదని చెబుతున్నారు. ఎంసెట్ రిజిస్ర్టేషన్లు, స్లాట్ బుకింగ్ గడువు పెంచాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.