హైదరాబాద్, వెలుగు:- అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా ఉందని ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు తగ్గట్టుగా అందరి అభిప్రాయాలను సేకరించి వచ్చే నెల 2వ తేదీ నాటికి సమస్యను ఒక కొలిక్కి తీసుకువస్తామని వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియెట్ లోని తన చాంబర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్, జర్నలిస్ట్స్ హౌసింగ్, డెక్కన్ జర్నలిస్ట్స్, తెలంగాణ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (జేసీహెచ్ఎస్ఎల్) సొసైటీలతో మంత్రి సమావేశమయ్యారు.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి, అందులో సభ్యుల సంఖ్య, సభ్యత్వానికి అర్హత, ఇతర అంశాలపై సొసైటీ సభ్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మినహా మిగిలిన మూడు సొసైటీలలో సుమారు 2,424 మంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నట్లు గుర్తించారు. మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టులు అందరూ ఒకేతాటిపై ఉంటే సమస్యల పరిష్కారం సులువు అవుతుందని, అన్ని సొసైటీలు కలిపి ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలలో సభ్యులు కాని, అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.
ఫ్యూచర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరో క్రాట్స్‌తో పాటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారికి సూచనప్రాయంగా వెల్లడించి సొసైటీలో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయాలని సూచిం చారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో తమ సొసైటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జి.ముకుంద రెడ్డి, సీపీఆర్‌ఓ మల్సూర్ పాల్గొన్నారు.
