హైదరాబాద్, వెలుగు: సొంత చెల్లి, బావ ఫోన్‌లు ట్యాప్ చేసిన కేటీఆర్ కు ఇందిరమ్మ పేరు కూడా పలికే అర్హత లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని తెలిపారు. అలాగే.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓట్లు అడగకూడదని కేటీఆర్ కు పొంగులేటి ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు కేటీఆర్సిద్ధమేనా అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నరేండ్లలో రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని.. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందన్నారు. ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని, హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని పొంగులేటి పేర్కొన్నారు.
