క్యూర్‌‌‌‌‌‌‌‌ లో ఇందిరమ్మ ఇండ్లకు మస్త్ క్రేజ్.. జులై 24 నాటికే 7వేల అప్లికేషన్లు: మంత్రి పొంగులేటి

క్యూర్‌‌‌‌‌‌‌‌ లో ఇందిరమ్మ ఇండ్లకు మస్త్ క్రేజ్.. జులై 24 నాటికే 7వేల అప్లికేషన్లు: మంత్రి పొంగులేటి
  • ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసే ప్రతిపక్షాల విమర్శలు
  • ఇందిరమ్మ ఇండ్ల పథకం పవర్ ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తదని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: క్యూర్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, శుక్రవారం నాటికే దాదాపు 7 వేలకు పైగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని, కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం పవర్ ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుందన్నారు. సచివాలయంలో శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌‌‌‌‌‌‌‌చాట్‌‌‌‌‌‌‌‌లో మంత్రి మాట్లాడారు. 

లబ్ధిదారులకు అతి తక్కువ ధరకు, నాణ్యమైన ఆస్తులను సమకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం క్యూర్ ఏరియా హౌసింగ్​ప్రాజెక్టు చేపట్టిందన్నారు. కేవలం 6 లక్షల రూపాయలు చెల్లిస్తే, మార్కెట్లో దాదాపు 60 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తిపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్నామని మంత్రి వివరించారు. 

ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతుండడంతో ప్రతిపక్షాలు సహనం కోల్పోయి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని పొంగులేటి దుయ్యబట్టారు. ‘ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులకు ఈ ప్రజాకర్షక పథకం జీర్ణం కావడం లేదు.. ఈ స్కీమ్ వారికి ఎక్కడో గుచ్చుకుంటోంది.. రాబోయే రోజుల్లో ఈ పథకం యొక్క అసలు పవర్  ఏంటో విపక్షాలకు స్పష్టంగా తెలుస్తుంది..’ అని మంత్రి పేర్కొన్నారు.