- లక్షకుపైగా జనాభా ఉన్న మండలాల్లో అపాయింట్ ప్రపోజల్స్ పంపాలి: మంత్రి పొంగులేటి
- భూ సమస్యల పరిష్కారంలో పొరపాట్లు జరగొద్దు
- ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వడమే మా లక్ష్యం
- ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ప్రతి పేదవాడికి సొంతిళ్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమిపై శాశ్వత హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నెలకొల్పేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా అదనంగా మరో తహసీల్దార్‌ను నియమించనున్నామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
గురువారం హౌసింగ్, రెవెన్యూ అంశాలపై హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్న భూ వివాదాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయడమే మార్గమని పేర్కొన్నారు. ఆర్డీవోలకు విస్తృతమైన అధికారాలు కల్పించామని ఇతర ప్రయోజనాలకు వీటిని వినియోగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్ల బాధ్యత కలెక్టర్లదే..
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అత్యధిక అధికారాలు కలెక్టర్లకే ఇచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం సేకరించి పూర్తిస్థాయిలో వినియోగించకుండా మిగిలి ఉన్న భూముల్లో అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నా, ఈ నెల 20లోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని, ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపాలన్నారు. జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీసు కోసం విజ్ఞప్తి చేయగా, మంత్రి అంగీకరించారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 70 ఎకరాల్లో కొత్త హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులకు అందించేలా వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ జి.చిన్నా రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
