ఆరు గ్యారంటీలకు రేషన్​కార్డే ఆధారం: పొంగులేటి

ఆరు గ్యారంటీలకు రేషన్​కార్డే ఆధారం: పొంగులేటి
  • ఈ నెల 28 నుంచిగ్రామాల్లో ‘ప్రజా పాలన’
  • మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెల్ల రేషన్​కార్డు ఆధారంగా అర్హులందరూ గ్రామసభల్లో ఆరుగ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి తీసుకున్న అప్లికేషన్లకు అధికారులు రశీదు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను పొంగులేటి సచివాలయ మీడియా సెంటర్​లో వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల గుమ్మం వద్దకే పాలన వస్తున్నదన్నారు. ఆరు గ్యారంటీల అప్లికేషన్లను ప్రజలకు ఒకటి, రెండ్రోజుల ముందుగానే అందిస్తామని తెలిపారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ, పట్టణాల్లో నిర్వహించబోయే ‘ప్రజాపాలన’ సభల్లో దరఖాస్తులను తీసుకుంటామన్నారు. ఒకవేళ ఎవరైనా అర్హులు గడువులోపు ఇవ్వలేకపోయినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ తర్వాత కూడా సంబంధిత అధికారులకు అప్లికేషన్​ ఇచ్చి రశీదు తీసుకోవచ్చని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా రెండ్రోజుల్లో వెబ్​సైట్ మూసివేయబోమని చెప్పారు.  ప్రజాపాలన కార్యక్రమానికి అవసరమైన నిధులను సీఎం విడుదల చేశారని తెలిపారు. 

అధికారులు చెప్పింది కూడా విన్నం

ప్రజాపాలన కార్యక్రమం ఇతర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం సహా, కేబినేట్ మంత్రులంతా అధికారులు చెప్పింది విన్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. తమ ప్రభుత్వం గత ప్రభుత్వంలా కాదని, గతంలో రాజు చెప్పిందే విని.. అదే అమలు చేయాలనే విధానం తమకు లేదని స్పష్టం చేశారు. అధికారులు చెప్పిన పలు సూచనలను వినడంతో పాటు, తమ ప్రభుత్వ ప్రాధామ్యాలు, అభివృద్ధి ప్రణాళికలను అధికారులకు సూచించినట్లు చెప్పారు.  

ధరణిపై చర్యలు తీసుకుంటం

ధరణి పోర్టల్ తో సామాన్యులకు మంచి జరగలేదని, సీఎం రేవంత్​ఈ అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి సభల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ధరణి పోర్టల్​తీసేస్తామంటోందని, ధరణిని ఎతివేస్తామంటున్నవారినే బంగాళాఖాతంలో వేద్దామన్న ఆయన మాటలను విన్న ప్రజలు.. వారినే బంగాళాఖాతంలో వేశారని మంత్రి గుర్తు చేశారు. ధరణిలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామన్నారు. ధరణిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఒక రోజంతా సమీక్ష చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాన్ని రూ.6.71లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేయడం అభివృద్ధా అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు సౌకర్యవంతంగా, ఫీల్ గుడ్​తో ఉన్నారని, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకున్నారని మంత్రి చెప్పారు.