ములుగులో విషాదం..బావిలోపడ్డ లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకుల మృతి

ములుగులో విషాదం..బావిలోపడ్డ లేగదూడను కాపాడబోయి  తండ్రీకొడుకుల మృతి

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో తీరని విషాదం నెలకొంది. ఒక మూగజీవాన్ని కాపాడబోయి  తండ్రీకొడుకులు ఇద్దరూ  మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రుసుపుత్ రాజు, ఆయన కుమారుడు పవన్ తమ లేగదూడ బావిలో పడిపోవడాన్ని గమనించారు. ఎలాగైనా ఆ మూగజీవాన్ని ప్రాణాలతో బయటకు తీసుకురావాలనే తాపత్రయంతో వారు బావిలోకి దిగారు.

అయితే ఆ బావిలో ప్రమాదకరమైన విషవాయువులు ఉండటంతో.. దిగిన కాసేపటికే వారికి ఊపిరాడలేదు. శ్వాస తీసుకోవడం కష్టమవ్వడంతో తండ్రీకొడుకులు ఇద్దరూ బావిలోనే ప్రాణాలు విడిచారు. లేగదూడను రక్షించబోయి కళ్లముందే ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో కర్లపల్లి గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

►ALSO READ | ఖమ్మం జిల్లాలో విషాదం... క్లాస్ రూమ్లో డెమో ఇస్తూ... గుండెపోటుతో కుప్పకూలిన టీచర్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకులు మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.