34 నెలల్లో 12.40 లక్షల పాస్ బుక్కులిచ్చాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

34 నెలల్లో 12.40 లక్షల పాస్ బుక్కులిచ్చాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  •     బీఆర్​ఎస్​ హయాంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం: పొంగులేటి
  •     ‘భూభారతి’తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం సమూలంగా పునర్నిర్మిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రెవెన్యూ సేవలను పారదర్శకంగా ప్రజల ముంగిట్లోకి తెచ్చామన్నారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 5,68,858 కొత్త పాస్‌‌‌‌‌‌‌‌బుక్కులు జారీ చేశామన్నారు. చట్టం రాకముందు ఇచ్చిన 6,71,508 పుస్తకాలతో కలిపి గత 34 నెలల కాలంలో మొత్తం 12,40,366 మంది రైతులకు ప్రభుత్వం పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌బుక్కులను అందజేశామని పేర్కొన్నారు.

రికార్డుల్లో పేర్లు లేకుంటే రీసర్వే

దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్నా.. రికార్డుల్లో పేర్లు లేక ప్రభుత్వ పథకాలకు దూరమైన వాస్తవ సాగుదారులకు భూభారతి రీ-సర్వే ద్వారా చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో రీ-సర్వే పూర్తి చేసి, గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఏండ్లుగా ఉన్న భూవివాదాన్ని పరిష్కరించి, 906 మంది రైతులకు 1,600 ఎకరాలపై సర్వహక్కులు కల్పించామన్నారు. 

సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో సర్వే చేపట్టి 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు అందించామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ములుగు జిల్లా ముల్కపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట, దమ్మపేటతోపాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో రీ-సర్వే వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఎక్కడైనా సరిహద్దు సమస్యలు, వివాదాలు ఉంటే ఆధునిక సాంకేతికతతో రీ-సర్వే నిర్వహించి, రికార్డులను పక్కాగా సరిచేయాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలో ప్రతిపాదిత ఫుడ్ పార్క్ ఏర్పాటు, భూసేకరణ పురోగతిపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్.లోకేశ్​కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.