మోదీ బహిరంగ సభను సక్సెస్ చేయాలి : బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

మోదీ బహిరంగ సభను సక్సెస్ చేయాలి : బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
  •     బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి

ఖమ్మం, వెలుగు: ఈనెల 10న హైదరాబాద్​లో జరిగే ప్రధాని మోదీ బహిరంగసభను సక్సెస్​ చేయాలని బీజేపీ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల కో ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్​రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.8 వేల కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. అనంతరం జరిగే బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్  రైతుల సమస్యను గాలికొదిలేసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. అకాల వర్షాలతో వరి, మక్కజొన్న పంటలు తడిసి, చేతికొచ్చిన పంట నేలపాలై రైతాంగం ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఓదార్చడం లేదన్నారు. 

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మంలోని ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని విమర్శించారు. దేశానికి, రాష్ట్రానికి సుస్థిరమైన, అవినీతి రహిత పాలన అందించగలిగేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతరం మాజీ సైనికులు పాండు రంగయ్య, అబ్దుల్  రశీద్, అంబటి సురేశ్, మెహబూబ్, హనుమంతరావును సన్మానించారు. ఉదయ ప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.