తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ను కంట్రోల్ చేసేందుకే ప్రధాని పర్యటన: పొన్నం ప్రభాకర్

తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ను  కంట్రోల్ చేసేందుకే ప్రధాని పర్యటన: పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో బీజేపీ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలోనే సీఎం కేసీఆర్ కాకతీయ టెక్స్ టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేశారని..రూ. 3500 కోట్లు 30 వేల ఉద్యోగాలని చెప్పి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. అల్రేడీ శంకుస్థాపన చేసిన టెక్స్ టైల్ పార్క్ కు మళ్లీ ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరించలేదని చెప్పారని గుర్తు చేశారు.  ఇప్పుడు ప్రధాని మోదీ విభజన హామీల నెరవేరుస్తున్నారని చెబుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నారని ప్రచారం చేయడం.. ఇందులో ఎంతవరకు నిజం ఉందని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీనా, వ్యాగన్ వాషింగ్ ఫ్యాక్టరీపైనా తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి, ప్రధానమంత్రి స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. 

సిరిసిల్లకు టెక్స్ టైల్ పార్కును ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు టెక్స్ టైల్ పార్కు ప్రారంభించిన చోట మళ్లీ ఎందుకు ప్రారంభిస్తున్నారని పొన్నం ప్రభాకర్ నిలదీశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఎన్ని సార్లు చెప్పినా.. ఆయనకు కనపడకపోగా వినిపించలేదని ఎద్దేవా చేశారు. తాను ఎంపిగా ఉన్న సమయంలోనే 2014లో వరంగల్- జగిత్యాల జాతీయ రహదారి పనులకు అనుమతులు తీసుకువచ్చామని గుర్తు చేశారు. రహదారి కోసం ఇప్పటికే రూ 40 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 


అప్పటి పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ అలైన్మెంట్ మార్చారని బండి సంజయ్ కి పలుమార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదన్నారు పొన్నం ప్రభాకర్. వినోద్ కుమార్ తన సొంత మెడికల్ కాలేజీ ప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చారని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీనిపై మాట్లాడలేదన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే ..శ్రీనివాస్ యాదవ్ కొడుకును బరిలో నింపారని... ఒకే సామాజిక వర్గంలో ఓట్లు చీల్చి కిషన్ రెడ్డికి మేలు చేసే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు.