
వయనాడ్: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటో ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఢిల్లీలోని రైతుల బాధను అర్ధం చేసుకోలేకపోతుందన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. రైతుల పరిస్థితిపై పాప్ స్టార్లు కామెంట్స్ చేస్తున్నా.. ప్రభుత్వానికి వాటిని ఆలకించే ఓపిక కూడా లేదని అన్నారు. కేరళలోని వయనాడ్ లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన మూడు అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోదని , అందుకో కారణముందని అన్నారు. దేశంలోని వ్యవసాయ విధానాన్ని నాశనం చేసి, వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా మార్చి ఆ మొత్తం బిజినెస్ ని మోడీ తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు అప్పగించేందుకే అగ్రి చట్టాలను రూపొందించారని విమర్శించారు.
భరత మాత వ్యవసాయాధారిత దేశమని, మిగతా వ్యాపారాలన్నీ తక్కిన వారికి చెందినవని అన్నారు రాహుల్. కొంతమంది వ్యవసాయ రంగాన్ని తమ సొంతం చేసుకోవాలనుకుంటున్నారని , మోడీ ప్రవేశపెట్టిన చట్టాలు దేశ వ్యవసాయ వ్యవస్థని శాసించేలా ఉన్నాయని అన్నారు. అంతకుముందు పార్లమెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ‘మనం ఇద్దరు మనకిద్దరు’ (హమ్ దో హమారే దో) గుర్తు చేస్తూ.. ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు.. ప్రభుత్వం వెలుపల ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్.