
ప్రముఖ హాస్య నటుడు కడలి జయ సారథి(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. సారథి మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సారథి దాదాపు 372పైగా సినిమాల్లో నటించారు. సీతారామ కళ్యాణం, పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, జగన్మోహిని, మన ఊరి పాండవులు, డ్రైవర్ రాముడు వంటి ఎన్నో సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు సారథి. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు సినిమాలకు నిర్మాతగానూ పని చేశారు.
నందమూరి తారకరామారావు దర్శకత్వంలో 1960లో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాతో సారథి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. చాలా సినిమాల్లో హాస్యపాత్రలు పోషించి.. ప్రేక్షకుల మెప్పు పొందారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాల్లోనూ మంచి పాత్రలు పోషించారు. సీతారామ కళ్యాణం (1961), పరమానందయ్య శిష్యుల కథ (1966), ఈ కాలపు పిల్లలు (1976), భక్త కన్నప్ప (1976), అత్తవారిల్లు (1977), అమరదీపం (1977), ఇంద్రధనుస్సు (1978), చిరంజీవి రాంబాబు, జగన్మోహిని (1978), మన ఊరి పాండవులు (1978), సొమ్మొకడిది సోకొకడిది (1978), కోతల రాయుడు (1979), గంధర్వ కన్య (1979), దశ తిరిగింది (1979), అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980), నాయకుడు – వినాయకుడు (1980), మదన మంజరి (1980), మామా అల్లుళ్ళ సవాల్ (1980), బాబులుగాడి దెబ్బ (1984), మెరుపు దాడి (1984), ఆస్తులు అంతస్తులు, శారద, అమరదీపం, ముత్యాల ముగ్గు సినిమాలతో పాటు ఇంకా మరెన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.