ఫెర్నాండేజ్ గోల్స్ వర్షం..రౌండ్ 16కు పోర్చుగల్

ఫెర్నాండేజ్ గోల్స్ వర్షం..రౌండ్ 16కు పోర్చుగల్

ఫిఫా వరల్డ్ కప్ 2022లో పోర్చుగల్ నాకౌట్కు చేరింది.  ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్లో 2–0 తేడాతో గెలవడంతో పోర్చుగల్ రౌండ్ 16కు చేరుకుంది. ఇప్పటికే నాకౌట్కు ఫ్రాన్స్, బ్రెజిల్ చేరుకోగా..పోర్చుగల్ కూడా నాకౌట్లో అడుగుపెట్టింది. పోర్చుగల్ జట్టులో బ్రూనో ఫెర్నాండేజ్..రెండు గోల్స్ చేసి జట్టును నాకౌట్ చేర్చాడు. 

ఫస్టాఫ్లో నో గోల్..

మొదటి అర్థభాగంలో ఇరు జట్లు గోల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే బంతిని ఎక్కువ సేపు తన నియంత్రణలో ఉంచుకున్న పోర్చుగల్..అనేక సార్లు ఉరుగ్వే గోల్ పోస్టుపై దాడి చేసింది. కానీ గోల్ మాత్రం కొట్టలేకపోయింది. అటు ఉరుగ్వే కూడా ఫస్టాఫ్ లో గోల్ సాధించకపోవడంతో..తొలి అర్థభాగం 0–0తో ముగిసింది. 

సెకండాఫ్ లో పోర్చుగల్ జోరు..

సెకండాఫ్ లో పోర్చుగల్ జోరు పెంచింది. ఇదే క్రమంలో 54వ నిమిషంలో ఫెర్నాండేజ్..తొలి గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని 1–0కు పెంచాడు. రొనాల్డో పాస్ ను అద్భుతంగా అందుకుని గోల్ కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఫెర్నాండెజ్ మరో గోల్ కొట్టాడు. దీంతో పోర్చుగల్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పోర్చుగల్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు ఉరుగ్వే ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.  ఈ విజయంతో గ్రూప్Hలో మొత్తం 6 పాయింట్లు దక్కించుకున్న పోర్చుగల్ రౌండ్ 16కు అర్హత సాధించింది. గ్రూప్ స్టేజులో భాగంగా పోర్చుగల్ తన చివరి మ్యాచ్ లో దక్షిణ కొరియాతో  తలపడనుంది. ఉరుగ్వే ఘనాతో ఆడనుంది.