V6 News

కోర్టు తీర్పు ఇచ్చినా పోస్టులు నింపరా: గురుకుల పీఈటీ అభ్యర్థులు

కోర్టు తీర్పు ఇచ్చినా పోస్టులు నింపరా: గురుకుల పీఈటీ అభ్యర్థులు

టీఎస్​పీఎస్సీ ముట్టడించిన గురుకుల పీఈటీ అభ్యర్థులు
అభ్యర్థులు, పోలీసుల మధ్య తోపులాట..ఉద్రిక్తత


బషీర్ బాగ్, వెలుగు: గురుకుల పీఈటీ అభ్యర్థుల చేపట్టిన టీఎస్​పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గురువారం అభ్యర్థులు గాంధీభవన్ నుంచి కమిషన్ ఆఫీసు వైపు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎక్కడివారక్కే రోడ్డుపై బైఠాయించి పోస్టింగ్ లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి నుంచి ఏంజే మార్కెట్ చౌరస్తా, కోఠి వైపు, ఉస్మానియా ఆస్పత్రివైపు వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ అయింది. అభ్యర్థులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు పిల్లలతో సహా వచ్చి ఆందోళనకు దిగారు. పోలీసులు పిల్లలను తల్లుల నుంచి బలవంతంగా గుంజుకోవడంతో చిన్నారులు విపరీతంగా ఏడ్చారు. అరెస్ట్ చేసిన అభ్యర్థులను బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ సందర్భంగా  తెలంగాణ నిరుద్యోగ, ప్రెవేట్ పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగోని సైదులుగౌడ్ మాట్లాడుతూ.. ఆరున్నరేండ్ల కింద టీఎస్​పీఎస్పీ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా గురుకుల పీఈటీ పోస్టులకు ఎంపికైన వారిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2017లో 616 పోస్టులతో నోటిఫికేషన్ ద్వారా 1:2 ప్రకారం 1,232 మందిని ఎంపిక చేశారని తెలిపారు. దీనిపై కోర్టులో కేసుపడడంతో వాయిదా వేస్తూ... ఆరున్నర సంవత్సరాలు కాలయాపన చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కేసులో తీర్పు వచ్చినప్పటికీ టీఎస్​పీఎస్సీ స్పందించటం లేదన్నారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి లను కలిసిన తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోస్టింగ్ లు ఇచ్చే వరకు అందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.