కరెంటు కొనుగోళ్లలో పవర్‌‌ బ్యాంకింగ్‌‌ పాలసీ

కరెంటు కొనుగోళ్లలో పవర్‌‌ బ్యాంకింగ్‌‌ పాలసీ
  •     ఇతర రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకొనే విధానాన్ని అవలంబిస్తున్న డిస్కంలు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో విద్యుత్‌‌ డిమాండ్‌‌ భారీగా ఉన్నా.. విద్యుత్‌‌ సంస్థలు దానికి తగ్గట్టుగా కరెంటును సరఫరా చేస్తున్నాయి. డిస్కంలకు ఆర్థిక స్థోమత లేక పోయినా ఇంత డిమాండ్‌‌లోనూ కరెంటు ఎలా సరఫరా చేస్తున్నాయనేది అందరికీ అంతు పట్టకుండా ఉంది. అయితే, కరెంటు కొనుగోళ్లలో కొత్త పవర్‌‌ పాలసీని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో పరస్పరం కరెంటు ఇచ్చిపుచ్చుకునే పవర్‌‌ బ్యాంకింగ్‌‌ పాలసీని అమలు చేస్తున్నది. దీంతో పెద్దగా ఖర్చు అవసరం లేకుండానే కరెంటు కొనుగోళ్లు చేపడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రధానంగా ఉత్తర ప్రదేశ్‌‌, హర్యానా రాష్ట్రాల్లో ఈ సీజన్‌‌లో పుష్కలంగా కరెంటు ఉన్న నేపథ్యంలో వారి నుంచి కరెంటును సేకరిస్తున్నారు. రాష్ట్రంలో కరెంటు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు వారికి తిరిగి సరఫరా చేస్తున్నారు. ఇలా వేరే రాష్ట్రాలతో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే దోరణితో డిస్కంలు వ్యవహరిస్తుండడంతో వేసవి గండం నుంచి బయట పడడం సులభతరం అవుతోంది.  రాష్ట్రంలో ప్రధానంగా ఫిబ్రవరి, మార్చి నెలలో అత్యధిక విద్యుత్‌‌ డిమాండ్‌‌ ఉంటుంది.

ఉష్ణోగ్రతలు ఎక్కువై ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో పాటు వ్యవసాయంలో యాసంగి సీజన్‌‌ నడుస్తుండడంతో రాష్ట్రంలో కరెంట్‌‌ వినియోగం భారీగా ఉంటుంది. ఈ సంవత్సరం మరింత  పెరిగింది. ఇప్పటికే రికార్డ్‌‌ స్థాయిలో 15,693 మెగావాట్‌‌ల డిమాండ్‌‌ నమోదైంది. ఈ నెలాఖరు వరకు 16 వేల మెగావాట్‌‌లకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవర్‌‌ బ్యాంకింగ్‌‌ పాలసీ రాష్ట్ర విద్యుత్‌‌ సంస్థలను కొంత మేర గట్టెక్కిస్తున్నది.