- నెలకు వెయ్యి కోట్లు అదనంగా ఇవ్వాలని ప్రపోజల్
- లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు
- అప్పులు, వడ్డీల భారం తగ్గించేందుకు కొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రక్రియను స్పీడప్ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు అప్పుల భారంతో సతమతమవుతున్నాయి. వీటి మొత్తం అప్పులు ఏకంగా రూ.లక్ష కోట్లు దాటాయి. వీటిపై 9% నుంచి 10% వడ్డీ చెల్లించాల్సి వస్తుండటంతో, విద్యుత్ సంస్థలపై ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల మేర భారం పడుతున్నది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన విద్యుత్ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కో, రెండు డిస్కమ్‌ల (టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్) మొత్తం అప్పులు ఈ ఏడాది జూన్ నాటికి రూ.1,00,180 కోట్లుగా ఉన్నాయి. ఇది 2014 నుంచి 2023 మధ్య రూ.80 వేల కోట్లుగా ఉండగా, రెండేండ్ల కాలంలో ఇంకో రూ.20 వేల కోట్లు పెరిగి రూ. లక్ష కోట్లు దాటింది. ఈ మొత్తం రుణాలలో అత్యధికంగా రూ.31,785 కోట్లు విద్యుత్ కొనుగోళ్లకు తీసుకున్న స్వల్పకాలిక అప్పులే. ఇక మొత్తం రూ.లక్ష కోట్ల అప్పుల్లో రెండు డిస్కమ్‌ల అప్పులే రూ.60 వేల కోట్లు. దీంతో డిస్కమ్‌లపై వడ్డీల భారం అధికంగా పడుతున్నది. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి సబ్సిడీ కింద ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న రూ.983 కోట్లకు అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖకు డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి విద్యుత్ సంస్థలను గట్టెక్కించడానికి ప్రభుత్వం త్వరలోనే కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయనుంది.
కరెంట్ కొనుగోళ్ల బకాయిలు 10 వేల కోట్లు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్కమ్‌లు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా, ఇండ్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఈ సబ్సిడీ బిల్లుల కింద ప్రభుత్వం ప్రతినెలా రూ.983 కోట్లు డిస్కమ్‌లకు విడుదల చేస్తున్నది. అయితే అప్పుల్లో ఉండటం, వడ్డీలు ఎక్కువ అవుతుండటంతో.. ఇప్పుడు ఇస్తున్న దానికి అదనంగా నెలకు వెయ్యి కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిస్కమ్‌లు కోరాయి. డిస్కమ్‌లు జెన్‌కో నుంచి రోజుకు సగటున 10 కోట్ల యూనిట్లకు పైగా కరెంటును కొనుగోలు చేస్తున్నాయి.
ఈ కరెంటు బిల్లుల కింద జెన్‌కోకు రూ.10 వేల కోట్లు బకాయి పడ్డాయి. ఇక కొన్న కరెంటులో 10 శాతానికిపైగా సరఫరా, పంపిణీలో నష్టపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యాలయాల నుంచి బిల్లులు రాకపోవడంతో డిస్కమ్‌ల సంచిత నష్టాలు 2014-–25 మధ్య 11 ఏండ్లలో రూ.76,021 కోట్లకు చేరాయి. వీటిలో గత ఒక్క ఏడాదిలోనే రూ.7,209 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో డిస్కమ్‌లపై అప్పులు, వడ్డీల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో మార్పులు తెచ్చి, కొత్తగా ఏర్పాటు చేసే సంస్థకు పాత అప్పులు, వడ్డీలను బదిలీ చేస్తారు. తద్వారా ప్రస్తుతమున్న డిస్కమ్‌లు అప్పులు లేని సంస్థలుగా తమ కార్యకలాపాలను మెరుగైన రీతిలో కొనసాగించడానికి వీలు కలుగుతుంది. ఈ సంస్కరణ ద్వారా డిస్కమ్‌ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి.. విద్యుత్ కొనుగోలు, పంపిణీ నష్టాలను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
