ఎమ్మార్వోలు, వీఆర్వోల పవర్స్ కట్

ఎమ్మార్వోలు, వీఆర్వోల పవర్స్ కట్

కొత్త రెవెన్యూ యాక్ట్​ రెడీ

అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం

ఆటోమేటిక్ గా మ్యుటేషన్ 

హైదరాబాద్, వెలుగు: కొత్త రెవెన్యూ చట్టం తయారీ తుది దశకు చేరుకుంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు చట్టం తయారవుతోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని రెవెన్యూ యాక్టులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న 145 చట్టాల స్థానంలో ఒకే చట్టం తీసుకొస్తున్నారు. సోమవారం నుంచి జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ యాక్టు బిల్లును ప్రవేశపెట్టాలనే పట్టుదలతో సర్కార్ ఉన్నట్లు సమాచారం. బిల్లును సీఎం కేసీఆరే ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. గతంలో ఉన్న పాత చట్టాల వల్ల ఎలాంటి అవినీతి జరిగింది? కొత్త చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే దానిపై కేసీఆర్ అసెంబ్లీలో వివరిస్తారని సమాచారం. కొందరు ఎమ్మార్వోలు, వీఆర్వోల వల్లనే రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతోందని సీఎం అనేక సార్లు చెప్పారు. కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో ఎమ్మార్వోలు, వీఆర్వోల అధికారాలను పరిమితం చేయనున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో ఆ అధికారుల పాత్ర లేకుండా చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద మ్యుటేషన్ జరిగేలా ఆటోమేటిక్ సిస్టమ్ ను తీసుకురానున్నారు. ఇక నుంచి ఎమ్మార్వోలు, వీఆర్వోలను సాధారణ సేవలకే పరిమితం చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

తీర్పులకు టైమ్ పీరియడ్

భూ వివాదాలపై త్వరగా తీర్పు ఇచ్చేలా కొత్త చట్టంలో కోర్టులకు గడువు విధించే చాన్స్ ఉంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్ని రోజుల్లో జిల్లా ట్రిబ్యునల్, ఎన్ని రోజుల్లో రాష్ట్ర ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలో చట్టంలో పొందుపర్చనున్నట్లు తెలిసింది. రిటైర్డ్ జడ్జీలతో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.