- నిజామాబాద్, మహబూబ్‌నగర్, హనుమకొండలో ఏర్పాటు
- ఆయా జిల్లాల్లో అనువైన స్థలాలను గుర్తించిన అధికారులు
- పరిశుభ్రత, శుభ్రమైన నీరు, టైల్స్, లైటింగ్‌తో హైటెక్ హంగులు
హైక్లాస్ రెస్టారెంట్ల స్థాయికి తీసిపోకుండా నిజామాబాద్, హనుమకొండ, మహబూబ్‌నగర్‌లో హైజనిక్ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం కలెక్టర్లు, మున్సిపల్ఆఫీసర్లు ఆయా సిటీల్లో స్థలాలు కూడా గుర్తించారు.
హైదరాబాద్, వెలుగు : సాయంత్రం అయితే చాలు.. బజ్జీలు, చాట్, పాస్తా, పిజ్జాలు లాగించే ఫుడ్ లవర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇన్నాళ్లూ రోడ్డు పక్కన దుమ్ము, ధూళి పడిన, ఈగలు వాలిన ఫుడ్ తినేస్తున్న జనాలకు ఇకపై ఆ తిప్పలు తప్పనున్నాయి. స్ట్రీట్ ఫుడ్ అంటేనే నాసిరకం అనే ముద్రను చెరిపేస్తూ.. కార్పొరేట్ స్థాయి రెస్టారెంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలో హైజనిక్ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, హనుమకొండ జిల్లాల్లో ఇలాంటి ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి అనువైన స్థలాలను కూడా గుర్తించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒక్కో సెంటర్‌కు రూ. కోటి నిధులు మంజూరు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న చిరువ్యాపారుల జీవనోపాధి దెబ్బతినకుండా వారిని ఒకే చోట చేర్చి ఈ మోడల్ స్ట్రీట్స్‌ను డెవలప్ చేయనున్నారు.
హైటెక్ హంగులతో...
కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ స్ట్రీట్స్‌లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దుమ్ము లేవకుండా ఆ ఏరియా అంతా టైల్స్ వేయనున్నారు. రాత్రి వేళల్లో జిగేల్‌మనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్ట్రీట్స్‌లో కస్టమర్లకు శుద్ధమైన నీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్లు, చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా వాష్ ఏరియాలు ఉండనున్నాయి. కుటుంబంతో సహా వచ్చి ప్రశాంతంగా కూర్చొని తినేలా బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరిసరాలను క్లీన్‌గా ఉంచేందుకు తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా వేర్వేరు కలర్ కోడ్ డస్ట్ బిన్లు పెట్టనున్నారు. దేశవ్యాప్తంగా 100 ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 86 సెంటర్లకు అనుమతులు ఇచ్చింది.
వెండర్లకు ఎఫ్ఎస్ఎస్‌ఐఏ ట్రైనింగ్
ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ స్ట్రీట్స్‌లో షాపులు ఏర్పాటు చేసుకోవాలన్నా, ఫుడ్ ఐటెమ్స్ అమ్మాలన్నా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. వెండర్లకు ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రతపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సర్టిఫికెట్ ఉన్న వారికే స్టాల్ పెట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వనున్నారు. అలాగే ఆయా స్టాల్స్‌లో వంట చేసే వారితో పాటు, వడ్డించే వాళ్లు సైతం చేతులకు గ్లౌజులు, తలకు క్యాప్‌తో ఆఫ్రాన్ తప్పనిసరిగా ధరించాలి.
గోర్లు పెంచుకోవడం, చేతికి ఉంగరాలు పెట్టుకోవడం నిషేధం. అలాగే వివిధ రకాల ఐటెమ్స్ తయారీకి వాడే నూనె, సరుకులు క్వాలిటీగా ఉండాలి. ఫుడ్ ఐటెమ్స్‌ను ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఐటెమ్స్‌లో క్వాలిటీ లేకుంటే వెంటనే లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు. స్థానికంగా దొరికే సంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తూనే, టూరిస్టులను ఆకర్షించేలా ఈ స్టాల్స్‌ను తీర్చిదిద్దబోతున్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు.
