V6 News

రైతు డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలి : రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా 

రైతు డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలి : రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా 

 హైదరాబాద్, వెలుగు: రైతు డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలని రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్​జేఏసీ చైర్మన్​ సాయిబాబా ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టొద్దని, ఉత్తర, దక్షిణ డిస్కంలను ప్రైవేటుపరం చేయొద్దన్నారు. రైతు డిస్కంకు సంబంధించిన అంశాలపై మంగళవారం హైదరాబాద్​లోని యూనియన్​ఆఫీస్​లో జేఏసీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తూ రైతు డిస్కం సీఎండీ ముషారఫ్​అలీ ఫారుఖీకి వినతిప్రతం అందించారు. రైతు డిస్కంతో రైతులకు, వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు ఇప్పుడున్న దాని కన్నా ఎక్కువ మేలు జరగదన్నారు. రైతు డిస్కంకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తామని సీఎండీ చెప్పినప్పటికీ వివిధ విద్యుత్ సంస్థల ఉద్యోగుల  సీనియారిటీ విషయంలో సమస్యలు వస్తాయని తెలిపారు.

నిపుణుల కమిటీ వేసి, జేఏసీ నాయకుల సందేహాలను నివృత్తి చేయాలని, లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్నారు. ఇప్పటికే రెండు డిస్కంలలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త సబ్ స్టేషన్లకు ఆపరేటర్లు లేరని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో 1,000 మంది కార్మికులను రైతు డిస్కంకు పంపిస్తే పాత డిస్కంలలో మరింత సిబ్బంది కొరత ఏర్పడుతుందని తెలిపారు. అలాగే రైతు డిస్కంలో కేవలం 1,000 మంది కార్మికులతో మొత్తం అగ్రికల్చర్ ట్రాన్స్​ఫార్మర్లను,  లైన్లను నిర్వహించడం, రైతులకు నిరంతర విద్యుత్ అందించడం కష్టమని చెప్పారు.