- ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనుకునేటోళ్లు సంపద మూటగట్టుకుపోరు: కేటీఆర్
- రాచరికంలోనైనా, ప్రజాస్వామ్యంలోనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాచరికంలోనైనా, ప్రజాస్వామ్యంలోనైనా ఇచ్చిన మాట నిల బెట్టుకుంటే బాగుంటుందని, ఎవరూ వెయ్యేండ్లు ఉండరని అన్నారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నామని, ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చున్నా మని పేర్కొన్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని మిడి సిపడినోళ్లెవరూ సంపదను మూటగట్టుకుని తీసుకెళ్లరని అన్నారు. పదవులనూ వెంటబెట్టుకుపోలేరని, భూమిపై మిగిలేది కేవలం పేరేనని తెలిపారు. శిబి చక్ర వర్తిలాంటి వాళ్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని చరిత్రలో తమ పేరును శాశ్వతం చేసుకున్నారని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్య వాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు చెప్పిన మాటలను ప్రస్తావించారు. దానిపై భాగవతంలో బమ్మెర పోతన రాసిన పద్యాన్ని చదివి వినిపించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ సంతకం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి గవర్నర్ ప్రసంగంలో తమిళసై ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. మొదటి కేబినెట్‌లోనే వాటికి చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ కూడా చెప్పారన్నారు. కానీ, సీఎం సంతకం చేసిన ఆ ఫైలు ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. ఆ ఫైలును కాకి ఎత్తుకెళ్లిందా? ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? అని అడిగారు. ప్రభుత్వం ఎన్నో అంశాలపై సిట్ వేస్తున్నదని, సీఎం సంతకం చేసిన ఆ ఫైలు మిస్సింగ్‌పైనా వేయాలని డిమాండ్ చేశారు.
సీఎం సంతకం చేసిన ఫైలుకే దిక్కు లేకుంటే.. ఇక ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ‘‘పేదల ఇండ్లకు జీరో వ్యాల్యూ అని సీఎం రేవంత్ అంటున్నారు.. అసలు సీఎంగా రేవంత్ చేసిన తొలి సంతకానికి జీరో వ్యాల్యూ.. ఆ ఫైలుకు, ఈ ప్రభుత్వానికే జీరో వ్యాల్యూ’’ అని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో రెండున్నరేండ్లలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తారనుకున్నామని, కానీ అలా జరగలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారని, కానీ, సభ్యులు మాత్రం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సభ బయట ఎట్ల అబద్ధాలు చెప్తున్నరో.. సభలో కూడా అలాగే చేస్తున్నారని ఆరోపించారు.
జార్జ్ ఆర్వెల్ మాట ఈ ప్రభుత్వానికి సరిపోతది..
‘ఇది నా గొడవ కాదు.. మీ గొడవ’ అని కాళోజీ అన్నారని, తాము కూడా ఇప్పుడు ప్రజల సమస్యలనే ప్రస్తావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం’ అని అన్న జార్జ్ ఆర్వెల్ మాట .. ఈ ప్రభుత్వానికి అక్షరాలా సూట్ అవుతుందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాలు మారిపోతున్నా ఆరు గ్యారంటీల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే అభయహస్తం అని అంటున్నా.. అమలు మాత్రం భస్మాసురహస్తంగా మారిందన్నారు. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, కానీ, గత రెండేండ్లుగా ప్రజలకు మాత్రం పరిహాస నామ సంవత్సరాలేనని పేర్కొన్నారు.
మూడు ముక్కల్లో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ‘ఎగ్గొట్టు..కూలగొట్టు..చెడగొట్టు’ అన్నట్టు మారిందని మండిపడ్డారు. ‘‘ఈ 28 నెలల్లో ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికి ఏముంది? బాకీలు..బకాయిలు, డైవర్షన్లు..కమీషన్లు.. బుల్డోజర్ల చప్పుళ్లు.. బూతుల మోతలు, ఆల్‌టైం రికార్డు అప్పులు..క్యూలైన్లలో చెప్పులు.. ఇదే మిగిలింది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం 420 ఎగనామాలు పెట్టి.. మూడున్నరకోట్ల మందికి పంగనామాలు పెట్టిందన్నారు. నిన్నటి గ్యారంటీ కార్డులు.. నేడు బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అప్పుడు వరాల గుట్ట.. ఇప్పుడు చిత్రగుప్తుడి చిట్టా..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో వరాల గుట్టలుగా, ఎన్నికల తర్వాత చిత్రగుప్తుడి చిట్టాలెక్క మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఓట్లకు ముం దు దానకర్ణ.. తర్వాత కుంభకర్ణగా రేవంత్ వ్యవహరించా రని అన్నారు. ‘‘అపర దానకర్ణుడిలా అందరికీ వాగ్దానాలు ఇచ్చారు.. ఇప్పుడు ఎవరొచ్చి ఏం అడిగినా కలియుగ కుంభకర్ణుడిలా ఉలకరు.. పలకరు. భారతదేశ ఎన్నికల చరిత్రలోనే కాదు.. ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలో కూడా ఇట్లాంటి బురిడీ మేనిఫెస్టో లేదు. ఎల్లయ్య గొంగడి ఎక్కడ ఉందంటే.. ఎక్కడ ఏసిన్నో అక్కడే ఉంది అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
మాటలు కోటలు దాటుతున్నా.. కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదు. జనం వారి సమస్యలపై తెలుగులో గోడు వెళ్లబోసుకుంటుంటే.. మీరేమో మలయాళం, మరాఠీ, బిహరీ, హిందీ భాష ల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ జనం సొమ్ముతో.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేసు కుంటారా? పీసీసీ సర్కారు మాయాజాలం.. పీసీ సర్కార్ మాయాజాలాన్ని మించిపోయింది’’ అని అన్నారు.
