ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక : పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం..ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక : పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం..ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి

ఆదిలాబాద్ నెట్​వర్క్, వెలుగు: పారదర్శకమైన పాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పట్టణంలోని​ఎస్టీయూ భవన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రివ్యూకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి హాజరయ్యారు.

99 రోజుల కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.తాగునీరు, విద్యుత్, రోడ్లు మరమ్మత్తులకు ప్రాధాన్యతనిస్తూ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.

 అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో పకడ్బందీగా అమలు చేస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరితో కలిసి హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తున్నామని, చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

మెరుగైన పాలన కోసమే ప్రజాపాలన 

 ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని నిర్మల్​అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. నిర్మల్​లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించి పేదల ఉన్నతికి పాటుపడుతోందన్నారు.

త్వరలోనే మరిన్ని కొత్త పథకాలు ప్రారంభిస్తుందని తెలిపారు. మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.  బెల్లంపల్లిలో సబ్​కలెక్టర్​మనోజ్​ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. మున్సిపల్​కమిషనర్ సంపత్​రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 

ప్రతీక్షణం ప్రజల మేలు కోసమే పనిచేస్తున్నాం

పేదలకు మేలు చేయాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిక్షణం పనిచేస్తోందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌లోని ఎస్పీఎం క్లబ్‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని, గ్రామ స్థాయి నుంచి సమస్యలను గుర్తించి, వాటిని వేగంగా పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

చెన్నూరులో ఆర్డీవో శ్రీనివాసరావు అధ్యక్షతన మున్సిపాలిటీ, మండలం స్థాయి సమావేశం నిర్వహించారు. డీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్ పర్సన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రోడ్లు, తాగునీటి సమస్యలపై చర్చించారు.