విద్యా శాఖ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి

విద్యా శాఖ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి
  • ఇది నాకు కొత్త శాఖ.. అవగాహన వచ్చాక మాట్లాడతానన్న మంత్రి
  • ప్రధాని మోదీ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించారని కామెంట్

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా ఆదివారం కర్తవ్య భవన్‌‌‌‌‌‌‌‌లో అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖల అధికారులు, సీనియర్ సిబ్బందితో రివ్యూ నిర్వహించారు.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎడ్యుకేషన్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం కర్తవ్య భవన్ వేదికగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖల అధికారులు, సీనియర్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ పథకాలు, నూతన సంస్కరణల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నమ్మకంతో తనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారని తెలిపారు.

‘‘శనివారం రాత్రి కర్నాటకలో ఉన్న నేను ఆదివారం ఉదయానికి ఢిల్లీ చేరుకుని బాధ్యతలు స్వీకరించాను. విద్యాశాఖ కార్యకలాపాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమాచారం సేకరిస్తున్నాను. ఇది నాకు కొత్త శాఖ కావడం వల్ల అధికారులతో సుదీర్ఘంగా చర్చించాను. ఇది చాలా పెద్ద శాఖ.  నాకు పూర్తి అవగాహన వచ్చాక మీడియాకు మరిన్ని వివరాలు వెల్లడిస్తాను’’ అని పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, పాఠశాల విద్యాశాఖ నూతన కార్యదర్శి టీకే అనిల్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ –2020 అమలు, మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, నడుస్తున్న ప్రధాన పథకాల గురించి అధికారులు మంత్రికి వివరించారు.

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఆదివారమే బాధ్యతలు స్వీకరించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థతో పాటు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.