తెలంగాణ ఉద్యమానికి సాయం చేసిన్రు

తెలంగాణ ఉద్యమానికి సాయం చేసిన్రు

ప్రణబ్ మరణం బాధాకరం: వివేక్ 

ఉద్యమం ముందుకు సాగేందుకు తోడ్పడ్డారు

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి రూ.10 వేల కోట్ల లోన్లు మాఫీ చేశారు

ఆయన లేకపోవడం తీరని లోటే

హైదరాబాద్, వెలుగు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయనతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగడంలో, రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీకి రూ.10 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడంలో ప్రణబ్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్ గా ఆయనే పరిష్కరించేవారని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రణబ్ ఏకంగా 54 పార్లమెంటరీ సబ్ కమిటీలకు చైర్మన్ గా ఉండేవారని.. ఆయన ఎంత మేధావో ఆ చైర్మన్ షిప్ లో కనబడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రణబ్ తో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని వివేక్ గుర్తు చేసుకున్నారు.

‘‘1972లో ఇందిరాగాంధీ కేబినెట్లో ప్రణబ్ముఖర్జీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా చేరారు. అదే రోజు మా నాన్న వెంకటస్వామి డిప్యూటీ మినిస్టర్ గా జాయిన్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం 42 ఏళ్లు. తెలంగాణ ఉద్యమ సమయంలో మా నాన్న, నేను వెళ్లి ప్రణబ్ ను కలిశాం. ఆయన మాతో మాట్లాడినప్పుడు.. తాను రాజకీయాల్లో చాలా మందిని కలిశానని, చూశానని.. కానీ తనకు నాకు ఇద్దరే స్నేహితులు ఉన్నారని అన్నారు. వెంకటస్వామి , ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్ తన స్నేహితులని చెప్పారు..” అని వివేక్ తెలిపారు. ప్రణబ్ రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చినపుడు తన తండ్రిని కలిశారన్నారు.

తెలంగాణ ఉద్యమం ముందుకు సాగేలా..

తెలంగాణ ఉద్యమం ముందుకు సాగేలా ప్రణబ్ సాయం చేశారని వివేక్ వెల్లడించారు. ‘‘2003లో కేసీఆర్ మా నాన్న వెంకటస్వామి దగ్గరికి వచ్చారు. ఎలక్షన్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందామని చెప్పారు. కానీ వైఎస్  రాజశేఖర్రెడ్డి వ్యతిరేకిస్తున్నారని, ఈ విషయంలో సాయం చేయాలని మా నాన్నను కోరారు. మా నాన్న కేసీఆర్ ను ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడారు. తర్వాత ప్రణబ్ ప్రత్యేకంగా సోనియాగాంధీ దగ్గరికి వెళ్లి మాట్లాడటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కుదిరింది. అదే పొత్తుతో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది. ఉద్యమం కొనసాగిస్తూ తెలంగాణ సాధించుకున్నం..” అని గుర్తు చేసుకున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ఉన్న రూ.10 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలంటూ తాను వెళ్లి ప్రధాని మన్మోహన్ ను కలిశానని.. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, కేబినెట్ సబ్ కమిటీ  చైర్మన్ గా ఉన్న ప్రణబ్ ను కలవాలని ఆయన సూచించారని వివేక్ తెలిపారు. రుణం రద్దుపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారన్నారు. దాంతో తాను వెళ్లి ప్రణబ్ ను కలిశానని.. కంపెనీని తిరిగి ప్రారంభించటం మా తండ్రి వెంకటస్వామి ఆశయమని చెప్పానని.. ఆ వెంటనే ప్రణబ్ రుణ మాఫీకి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ప్రణబ్ మరణం బాధాకరమని, ప్రత్యేకంగా తమ కుటుంబానికి విచారకరమని చెప్పారు. ప్రణబ్ ఫ్యామిలీకి సంతాపం  ప్రకటించారు.