చరమాంకంలో చేదోడుగా..!..సీనియర్ సిటిజన్లకు డే కేర్ సెంటర్లు

చరమాంకంలో చేదోడుగా..!..సీనియర్ సిటిజన్లకు డే కేర్ సెంటర్లు
  •     సీనియర్ సిటిజన్లకు అండగా ప్రణామ్ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లు
  •     లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, డాక్టర్లతో హెల్త్ చెకప్​
  •     రాష్ట్రవ్యాప్తంగా 32 కేంద్రాలు.. ఒక్కో సెంటర్‌‌కు నెలకు లక్ష ఫండ్

హైదరాబాద్, వెలుగు: జీవిత చరమాంకంలో తోడు కోసం ఎదురుచూసే పెద్దలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రణామ్’ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లు భరోసాగా నిలుస్తున్నాయి. ఒంటరితనం, మానసిక కుంగుబాటుకు గురవుతున్న సీనియర్ సిటిజన్లకు ఈ సెంటర్లు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. కేవలం కాలక్షేపానికే కాకుండా ఆరోగ్యం, విజ్ఞానం, మానసిక ప్రశాంతతను చేకూర్చే సంపూర్ణ సంరక్షణ వేదికలుగా సేవలందిస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రణామ్ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో సుమారు 50 మంది వృద్ధులకు వసతి కల్పిస్తున్నారు. రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, పుస్తకాలు, న్యూస్ పేపర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ సెంటర్లలోనే డాక్టర్లు, నర్సులతో రెగ్యులర్ హెల్త్ చెకప్‌‌లు నిర్వహిస్తూ, ఉచితంగా మందులు అందజేస్తున్నారు.

కలెక్టర్ల పర్యవేక్షణలో సెంటర్లు..

డే కేర్ సెంటర్ల నిర్వహణ పారదర్శకంగా సాగేలా పటిష్ట వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్జీవోల భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్‌‌కు ప్రభుత్వం నెలకు రూ.లక్ష చొప్పున నిధులు విడుదల చేస్తోంది. ప్రణామ్ సెంటర్లను ఈ ఏడాది మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా భవన్ లో ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా నడుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.