దేశంలో అత్యంత వెనకబడిన బీహార్ రాష్ట్రాన్ని బాగు చేయడమే తన లక్ష్యమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ జన్ సూరజ్ పేరుతో బీహార్ లో పాదయాత్రను ప్రారంభించారు. చంపారన్ జిల్లాలోని భితిహర్వాలో గాంధీ ఆశ్రమం నుంచి యాత్రను ప్రారంభించారు. మొత్తం 15 నెలల పాటు జనం మధ్య గడపనున్నారు. ప్రశాంత్ కిషోర్ దాదాపు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. తొలి రోజు 10 కిలోమీటర్లు మాత్రమే నడవనున్నారు. రాత్రి 8 గంటలకు గౌనాహాలో పాదయాత్ర ముగియనుంది.
బీహార్ లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీహార్ రాష్ట్రాన్ని బాగు చేయడమే తన లక్ష్యమని పీకే తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి పౌరుడిలో రాజకీయ చైతన్యం తీసుకొస్తానన్నారు. రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
