- జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కింగ్ మేకర్ గా మారినా సరే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. శనివారం ఎన్డీటీవీ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందుగానీ, తర్వాతగానీ ఏ పార్టీతోనూ తాము పెట్టుకోబోమని స్పష్టం చేశారు.
‘‘ప్రస్తుతం జన్ సురాజ్ పార్టీని ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. అయితే, ఒక పార్టీకి ఓటు వేయాలంటే ఆ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఈ ఎన్నికల్లో మాకు వస్తే 10 లేదా 150 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నా. ఒకవేళ హంగ్ ఏర్పడి మేం కింగ్ మేకర్‌గా మారినా పొత్తులు పెట్టుకోబోం. ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోయినా, మా పని మేం చేస్తం. కావాలంటే రాసిస్తాను. ఎన్నికల ముందుగానీ తర్వాతగానీ ఏ పార్టీతోనూ మేము పొత్తు పెట్టుకోం” అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
ఆ మేరకు రాసి ఇవ్వాలని ఎన్డీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ కన్వాల్ అడగగా.. ప్రశాంత్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఒకవేళ హంగ్ వచ్చి తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే తాను ఏమీ చేయలేనన్నారు. ‘‘కొంతమంది డబ్బుకు లొంగిపోతారు. మరి కొంతమంది సీబీఐ లాంటి సెంట్రల్ ఏజెన్సీలకు భయపడి పార్టీ మారుతారు.
మా పార్టీలో 30 మంది గెలిచి హంగ్ ఏర్పడితే, ఆ ఎమ్మెల్యేలందరూ నా మాట వింటారా? అయినప్పటికీ నిజాయితీగానే ఉంటా. పొత్తు పెట్టుకోబోమని నాతో రాయించుకున్నట్లే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ రాయించుకోండి. ఏ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కొనబోమని ఆయన వద్ద మాట తీసుకోండి” అని ప్రశాంత్ సూచించారు.
