పీఆర్సీ వెంటనే ఇవ్వాలి : సీఎస్​ను కోరిన ఉద్యోగ సంఘాల జేఏసీ

పీఆర్సీ వెంటనే ఇవ్వాలి : సీఎస్​ను కోరిన ఉద్యోగ సంఘాల జేఏసీ

త్వరలోనే ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది
ఉద్యోగులు ఆందోళన చెందొద్దు
సీఎం పిలిచి మాట్లాడుతరు: జేఏసీ చైర్మన్​ రవీందర్​రెడ్డి
సీఎం సానుకూలమే: మమత
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆలస్యం: పద్మాచారి

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటించాలని కోరుతూ సీఎస్  సోమేశ్​కుమార్ ను ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. బుధవారం బీఆర్కే భవన్ లో ఆయనతో సమావేశమై వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం దృష్టికి ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్తానని, త్వరలో నివేదిక తెప్పించుకుంటానని సీఎస్​ తమతో అన్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే పీఆర్సీ వస్తుందని సీఎస్  చెప్పినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు పే రివిజన్​ కమిషన్​  గడువు పొడిగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో ఉద్యోగులు ఆందోళన చెందారని తెలిపారు. అయితే.. కమిషన్ గడువు పెంపుతో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

కమిషన్ ను కేవంల వేతన సవరణ కోసమే ఏర్పాటు చేసింది కాదని, ఉద్యోగులకు సంబంధించి అనేక అంశాల స్టడీ కోసం ఏర్పాటు చేశారని వివరించారు. వివిధ అంశాలపై కమిషన్  స్టడీ చేస్తున్నందునే దాని గడువు పొడిగించారని అన్నారు.  వేతన సవరణ నివేదిక సిద్ధంగా ఉందని, నెలలోపే నివేదికను ప్రభుత్వానికి అందచేస్తామని కమిషన్  చెప్పిందని రవీందర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు అండగా ఉన్నారని, ఈ విషయాన్ని పలుసార్లు ప్రకటించారన్నారు. మార్చిలో పీఆర్సీ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే ఉద్యోగ సంఘాల ను పిలిచి మాట్లాడుతానని ఇప్పటికే సీఎం చెప్పారని తెలిపారు. ఏ ఉద్యోగీ నష్టపోకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. ఈహెచ్ ఎస్   కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా కిందిస్థాయి ఉద్యోగులకు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.

సీఎంపై నమ్మకముంది: పద్మాచారి

కమిషన్​ గడువు పెంపు జీవో లో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. త్వరగా పీఆర్సీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కమిటీ వేశారని, కానీ అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరించి పీఆర్సీ ని ఆలస్యం చేస్తున్నారని  ఆరోపించారు. ఇప్పటికే రెండు పీఆర్సీ లు కోల్పోయినట్లు గుర్తుచేశారు. ఉద్యోగుల పీఆర్సీ తోపాటు రిటైర్మెంట్​ వయసు పెంపు, ఏపీలో  పనిచేస్తున్న ఫోర్త్​ క్లాస్​ ఎంప్లాయీస్​ను స్వరాష్ట్రానికి తీసుకొచ్చే అంశాన్ని  సీఎం కేసీఆర్ నెరవేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. సీఎస్​ను కలిసిన వారిలో  టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో నేతలు కృష్ణయాదవ్, లక్ష్మీనారాయణ, ఇంటర్ జేఏసీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్  ఉన్నారు.

సీఎంతో భేటీ అవుతం: మమత

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, సీఎం కేసీఆర్  పీఆర్సీ ఇస్తామని ఇదివరకే చెప్పారని జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవో అధ్యక్షురాలు మమత అన్నారు. ఉద్యోగులకు చెల్లించే పీఆర్సీకి కమిషన్​ గడువు పొడిగింపు తో సంబంధం లేదని, ఈ విషయాన్ని సీఎస్​ కూడా తమతో అన్నారని ఆమె తెలిపారు. సీఎం  కేసీఆర్​తో త్వరలోనే ఉద్యోగ జేఏసీ భేటీ అవుతుంద న్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి సీఎం  సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం