ఆర్గాన్ డోనర్ కుటుంబాలకు డబుల్ బెడ్రూం స్కీంలో ప్రాధాన్యత: మంత్రి హరీశ్ రావు

ఆర్గాన్ డోనర్ కుటుంబాలకు డబుల్ బెడ్రూం స్కీంలో ప్రాధాన్యత: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ఆర్గాన్ డోనర్ల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ స్కీమ్​లు అందేలా చూస్తామని మంత్రి హరీశ్‌‌‌‌రావు చెప్పారు. ఆర్గాన్ డోనర్ల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో సీట్లు కేటాయించి, ఉచిత విద్యను అందజేస్తామన్నారు. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 162 మంది ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానానికి ఒప్పుకుని, ఇంకొకరికి ప్రాణదానం చేసినవారందరూ ఎంతో స్ఫూర్తిదాయకం అని మంత్రి ప్రశంసించారు. అలాంటి వారందరికీ చేతులెత్తి మొక్కుతున్నానన్నారు. ‘‘వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా.. కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేము. అంతటి సాంకేతికత అభివృద్ధి చెందలేదు. మరణించిన తర్వాత విలువైన అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న. బ్రెయిన్​డెడ్‌‌‌‌ అయిన సందర్భాల్లో కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను నిర్వర్తించి, ఆర్గాన్‌‌‌‌ డొనేషన్‌‌‌‌ ద్వారా ప్రాణం పోయాలి”అని మంత్రి సూచించారు. 

దాతల కోసం 3,180 మంది ఎదురుచూస్తున్నరు..

2013లో ప్రారంభమైన జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ ప్రోగ్రాం ద్వారా ఇప్పటి దాకా 1,142 మంది నుంచి 4,316 ఆర్గాన్స్‌‌‌‌ సేకరించి, అవసరం ఉన్నోళ్లకు ట్రాన్స్‌‌‌‌ప్లాంట్ చేశారని హరీశ్ రావు వెల్లడించారు. ఇంకో 3,180 మంది ఆర్గాన్స్‌‌‌‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, బ్రెయిన్ డెడ్​ సందర్భాల్లో ఆర్గాన్ డొనేషన్‌‌‌‌కు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌లోనూ బ్రెయిన్ డెత్ కేసులను గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.