ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వినే పదం నో-కాస్ట్ ఈఎంఐ. అంటే తీసుకుంటున్న వస్తువుకు ఎలాంటి వడ్డీ లేకుండా డబ్బును కొన్ని వాయిదాల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు. చాలా మంది నో కాస్ట్ అనగానే అసలు ఏం ఖర్చు ఉండదుగా తీసుకుందా అని అనుకుంటుంటారు. అయితే దీని వెనుక ఉన్న లెక్కల గారడీ గురించి చాలా మందికి అస్సలు తెలియదు.
ఆన్‌లైన్ షాపింగ్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు, ఫర్నిచర్ వంటి ఖరీదైన వస్తువులను కొనేటప్పుడు, వడ్డీ లేకుండా సులభ వాయిదాలలో చెల్లించవచ్చనే వాగ్దానం సామాన్యులను ఊరిస్తుంది. అయితే అసలు 'నో-కాస్ట్' అనే పదం వెనుక ఒక చిన్న మతలబు ఉంది. సాధారణంగా బ్యాంకు ఎప్పుడూ వడ్డీ లేకుండా లోన్ ఇవ్వదు. ఇక్కడ మీరు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని, సెల్లర్ లేదా కంపెనీ ముందుగానే డిస్కౌంట్ రూపంలో తగ్గిస్తారు. ఉదాహరణకు మీరు రూ.50వేలు విలువైన వస్తువును ఈఎంఐలో కొంటే, దానిపై పడే రూ.3వేలు వడ్డీని వస్తువు ధరలో ముందే తగ్గిస్తారు. ఫలితంగా మీరు వడ్డీ లేని అసలు ధరనే కడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ టెక్నికల్ గా అది కూడా ఒక రుణమే.
కంటికి కనిపించని నష్టాలు..
నో-కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్నప్పుడు మీకు వచ్చే అతిపెద్ద నష్టం ఏమిటంటే.. నేరుగా నగదు చెల్లిస్తే వచ్చే భారీ డిస్కౌంట్లను కోల్పోవడం. పండుగ ఆఫర్లలో ఫుల్ పేమెంట్ చేస్తే రూ.5వేలు తగ్గే అవకాశం ఉంటే.. ఈఎంఐ ఎంచుకున్నప్పుడు ఆ డిస్కౌంట్ కేవలం రూ.2వేలకే పరిమితం కావచ్చు. అంటే మీరు వడ్డీ కట్టడం లేదు అనుకుంటున్నారు కానీ రావాల్సిన ఆఫర్‌ను మిస్ అవుతూ పరోక్షంగా ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారన్నమాట.
అదనపు ఛార్జీలు..
ఈఎంఐ ప్రక్రియలో ప్రాసెసింగ్ ఫీజు అనేది ప్రధానమైన అదనపు భారం. ఇది చిన్న మొత్తమే అనిపించినా.. వస్తువు ధర పెరిగే కొద్దీ ఈ ఫీజు కూడా పెరుగుతుంది. దీనికి తోడు మీరు చెల్లించే వడ్డీ భాగంపై 18% జీఎస్టీ అదనంగా పడుతుంది. ఈ వివరాలన్నీ కొనేటప్పుడు స్పష్టంగా కనిపించవు, మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ వచ్చినప్పుడే అసలు విషయం బయటపడుతుంది.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం..
ప్రతి నో-కాస్ట్ ఈఎంఐ ఒక చిన్న రుణంతో సమానం. ఇలాంటివి వరుసగా ఎక్కువగా ఉంటే, మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో మీరు హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ పెండింగ్ ఈఎంఐలు మీ రుణ అర్హతను తగ్గించవచ్చు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి స్వల్పకాలిక అప్పులపై ఎక్కువగా ఆధారపడవద్దని హెచ్చరిస్తూనే ఉంది.
మెుత్తానికి నో-కాస్ట్ ఈఎంఐ అనేది ఒక సౌకర్యం మాత్రమే కానీ ఉచితం కాదు. కొనేముందు వస్తువు అసలు ధరను, ఈఎంఐ ద్వారా చెల్లించే మొత్తం ఖర్చును బేరీజు వేసుకోవడం మంచిది. మీరు షాపింగ్ చేయనప్పుడు కూడా ధరలను కంపేర్ చేసి చూసుకుంటే అసలు విషయం మీకే అర్థమౌతుంది ఎవరికీ ఏదీ ఊరకే రాదని.
