- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కారు ఢీ కొట్టడంతో భారత సంతతికి చెందిన గర్బిణి మరణించింది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్ కు చెందిన 33 ఏండ్ల సమన్విత ధారేశ్వర్ కుటుంబం హార్న్స్ బై ప్రాంతంలో నివసిస్తున్నది. స్థానికంగా ఉన్న అలస్కో యునిఫామ్స్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నది.
సమన్వితకు ఇప్పటికే మూడేండ్ల కుమారుడు ఉండగా ఇప్పుడు 8 నెలల గర్బిణి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తన భర్త, మూడేండ్ల కుమారుడితో కలిసి వాకింగ్ కోసం సమీపంలోని పార్క్ కు వెళ్లింది. వాకింగ్ పూర్తయ్యాక ఇంటికి తిరిగి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కియా కారు ఎదురొచ్చింది.
సమన్విత ఫ్యామిలీని చూసిన డ్రైవర్ కారును స్లో చేశాడు. అయితే, ఆ కారు వెనక వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ అదుపుతప్పింది. కియా కారును ఢీకొట్టింది. ఆ వేగం ధాటికి కియా కారు ముందుకెళ్లి సమన్వితను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను వెస్ట్ మీడ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ సమన్వితతో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా చనిపోయారని డాక్టర్లు చెప్పారు.
