
- రెండు నెలల కింద సూరత్‌లో పుట్టిన శిశువు
- వెంటిలేటర్ మీద 1,300 కిలోమీటర్లు ప్రయాణించి సికింద్రాబాద్‌కు..
- శిశువు ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జి చేసిన డాక్టర్లు
హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్ డాక్టర్లు రెండు నెలల పాటు అరుదైన చికిత్స చేసి ఓ శిశువుకు ప్రాణం పోశారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో నెలలు నిండకుండానే, తక్కువ బరువుతో పుట్టిన ఓ శిశువును రోడ్డు మార్గం ద్వారా 1,300 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు తీసుకొచ్చి చికిత్స అందించారు. శిశువు పూర్తిగా కోలుకోవడంతో గురువారం డిశ్చార్జి చేశారు.
ఈ వివరాలను కిమ్స్ కడల్స్ హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ బాబు ఎస్.మదార్కర్ సోమవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సూరత్‌లో ఓ తెలుగు కుటుంబానికి ఏడో నెలలోనే 1.1 కిలోల బరువుతో రెండు నెలల కింద మగశిశువు జన్మించాడు. పుట్టుకతోనే శ్వాస, అవయవ సమస్యలతో బాధపడుతున్న బాబుకు.. అక్కడి హాస్పిటల్‌లో చికిత్స చేసినా నయం కాలేదు. దీంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్‌ను సంప్రదించారు.
ఆ వెంటనే సూరత్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్‌కు శిశువును తీసుకొచ్చారు. సూరత్‌లో ఉన్నప్పటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో వెంటిలేటర్‌పైనే తీసుకొచ్చారు. ఇందుకోసం రెండు అంబులెన్స్‌లు, 31 మంది సిబ్బంది, ఆక్సిజన్ సిలిండర్లు, బయోమెడికల్ టీమ్స్ పనిచేశాయి. సూరత్ నుంచి 14- నుంచి16 గంటల పాటు ప్రయాణించి, నాసిక్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు మార్చుకుంటూ సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు.
ఇక్కడ రెండు నెలల పాటు ట్రీట్‌మెంట్ అందించడంతో 1.1 కిలోల బరువు ఉన్న శిశువు 1.9 కిలోలకు పెరిగాడు. శిశువు ప్రస్తుతం వెంటిలేటర్ లేకున్నా చురుగ్గానే ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. కొన్నాళ్లు హైదరాబాద్‌లోనే ఉండి టెస్ట్‌లకు రావాల్సి ఉంటుందని డాక్టర్ మదార్కర్ తెలిపారు. నెలలు నిండని శిశువును రోడ్డు మార్గంలో 723 కిలోమీటర్లు తీసుకెళ్లడమే ఇప్పటివరకు రికార్డు అని, ప్రస్తుతం 1,300 కిలోమీటర్ల ప్రయాణం చేయడంతో ఇది గిన్నిస్ బుక్‌లో నమోదు అవుతుందని తెలిపారు. శిశువుకు ట్రీట్‌మెంట్ అందించిన వారిలో డాక్టర్లు సతీశ్, రియాన్, సంతోష్ ఉన్నారు.