హామీలు అమలు చేసే వరకు పోరాడుతం: ప్రేమేందర్ రెడ్డి

హామీలు అమలు చేసే వరకు పోరాడుతం:  ప్రేమేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : ప్రజలకు కేసీఆర్  ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్  రెడ్డి అన్నారు. హామీలు అమలు చేయాలని అడిగితే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా దాడులు చేయిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే నెల  7న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన కార్యాలయాలను ప్రభుత్వం అప్పజెప్పిన అడ్డాలుగా చూస్తున్నారు. ప్రజల కోసం కట్టిన క్యాంపు కార్యాలయాల దగ్గరకు ప్రజలు వెళ్తే.. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేస్తున్నారు. బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది” అని ప్రేమేందర్  పేర్కొన్నారు.

కాంగ్రెస్​ మీడియా కో ఆర్డినేటర్ల నియామకం

హైదరాబాద్​, వెలుగు :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో మీడియా కో ఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. హైదరాబాద్​కు ఎస్వీ రమణి, మనీశ్​ ఖండూరి, నీరజ్​ మిశ్రా, అలీ మెహ్దీ, వరంగల్​కు డాలీ శర్మ, కరీంనగర్​కు గౌతమ్​ సేఠ్​, ఖమ్మంకు బీఆర్​ అనిల్​ కుమార్​ను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ మీడియా పబ్లిసిటీ చైర్మన్​ పవన్​ ఖేరా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియమితులైన వారంతా పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ చామల కిరణ్​ కుమార్​ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.