వారసత్వ సంస్కృతిని పరిరక్షిస్తున్నం : కిషన్ రెడ్డి

వారసత్వ సంస్కృతిని పరిరక్షిస్తున్నం : కిషన్ రెడ్డి
  • గోల్కొండ కోటలో లైట్, సౌండ్ షో ప్రారంభం

మెహిదీపట్నం, వెలుగు:  తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన కాకతీయుల కాలమైన11వ శతాబ్దంలో కట్టినప్పటి నుంచి బహమనీ సుల్తానులు, అసఫ్‌‌‌‌‌‌‌‌ జాహీలు, నిజాంల వరకు.. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక గోల్కొండ కోట అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సందర్శించే పర్యాటకుల టాప్ పర్యాటక స్థలాల జాబితాలో గోల్కొండ ఓ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని తెలిపారు. ఘనమైన సాంస్కృతిక చరిత్ర కలిగిన కోట వివరాలను పర్యాటకులకు మరింత ఆసక్తికరమైన పద్ధతిలో, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ ద్వారా లేజర్ లైట్స్ , సౌండ్ షో ను బుధవారం రాత్రి కోటలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కోటలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘లేజర్ లైట్అండ్ సౌండ్ షో’ను ఏర్పాటు చేశామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్కొండ చరిత్రను మరింత గొప్పగా చూపించే లక్ష్యంతో కేంద్రం త్రీడీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై-రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్‌‌‌‌‌‌‌‌లైట్స్ వంటి అధునాతన సాంకేతికత కలబోతతో  రూపొందించిందని చెప్పారు.

ఈ ‘షో’.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ల్లో అందుబాటులో ఉందన్నారు. మన చరిత్ర తెలుసుకోవాలంటే ఇలాంటి చారిత్రక కట్టడాలను సంరక్షించుకోవాలని, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలో కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని మోదీ చొరవతీసుకున్నారని పేర్కొన్నారు.వెయ్యి స్తంభాల గుడిని పునరుద్ధరిస్తున్నామని, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద భక్తులకు ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని భవిష్యత్ తరాల కోసం సంరక్షిస్తున్నామని, బోనాలు, బతుకమ్మలను జాతీయస్థాయిలో జరుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, పురవస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.