వర్గీకరణపై పార్టీల వైఖరి మారాలె: అధ్యక్షుడు చెన్నయ్య

వర్గీకరణపై పార్టీల వైఖరి మారాలె: అధ్యక్షుడు చెన్నయ్య

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. లేకుంటే వర్గీకరణ పేరిట చిచ్చుపెట్టే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మాలలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌ లక్డీకపూల్‌లో మాల మహానాడు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. అనంతరం చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తెస్తున్నాయన్నారు. 

ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, వర్గీకరణకు 13 రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నారాయణ స్వామి రాజ్యసభలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అన్ని పార్టీ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల18 నుంచి 22 వరకు ఢిల్లీలోని జంతర్‌‌ మంతర్‌‌ వద్ద వివిధ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని చెన్నయ్య వెల్లడించారు.

బీఎస్పీ చీఫ్ మాయావతి, కేంద్ర మంత్రి నారాయణ స్వామిని కలిసి వినతిపత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల ఎంపీలను కలిసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వినతి పత్రాలు అందజేసి, ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా అడ్డుకుంటామన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశ అనంతరం బీజేపీ ఆఫీసు ముట్టడికి మాల మహానాడు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.