రేపు రామప్పకు రాష్ట్రపతి

రేపు రామప్పకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (బుధవారం) కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. బుధవారం  మధ్యాహ్నం 3.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ లోని ప్రఖ్యాత రామప్ప ఆలయ సందర్శనకు ఆమె బయలుదేరుతారు.  దర్శనం పూర్తయిన వెంటనే తిరిగి హైదరాబాద్ కు రాష్ట్రపతి పయనమవుతారు. బొల్లారంలోని హెలిప్యాడ్ లో సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో చేరుకుంటారు. 

అంతకుముందు ఇవాళ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు, బోధనా సిబ్బందితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఇవాళ సాయంత్రం నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించారు.  74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ ల నుంచి రాష్ట్రపతి  గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. అకాడమీలోనే దాదాపు  1 గంట 25 నిమిషాల పాటు రాష్ట్రపతి గడిపారు. ఆ తర్వాత మిథానిలో ఏర్పాటుచేసిన  వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. 

విజిట్ లో పాల్గొనే అధికారులకు కొవిడ్ పరీక్షలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప సందర్శనకు రానున్న నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఆమె విజిట్ లో పాల్గొనే ఆఫీసర్లకు, సిబ్బంది కి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో, ఇతర ఉన్నతాధికారులు అందరికీ కొవిడ్ పరీక్షలు చేశారు.