
కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్‌హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ఇచ్చిన తేనీటి విందుకు గవర్నర్ తమిళిసైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీనివాస్‌రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు, కే.కేశవరావు, మహమూద్‌అలీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం డిసెంబరు 18న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. విడిది ముగించుకొని శనివారం ఆమె హైదరాబాద్ నుంచి జైపూర్‌కు వెళ్తున్నారు. ఆనవాయితీలో భాగంగా రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.