వార్ హెలికాప్టర్ ప్రచండ్లో ..రాష్ట్రపతి ముర్ము ప్రయాణం

 వార్ హెలికాప్టర్ ప్రచండ్లో ..రాష్ట్రపతి ముర్ము ప్రయాణం

జైసల్మేర్: రాష్ట్రపతి, సాయుధ బలగాల సుప్రీం కమాండర్  ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి వార్ హెలికాప్టర్  ‘ప్రచండ్’ లో శుక్రవారం ఆమె ప్రయాణించారు. ఈ హెలికాప్టర్​లో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సాధించారు. 

ముందుగా ఉదయం 9.15 గంటలకు జైసల్మేర్​లోని ఎయిర్  ఫోర్స్  స్టేషన్​కు రాష్ట్రపతి చేరుకున్నారు. హెలికాప్టర్  గురించి అధికారులు ఆమెకు వివరించారు. అనంతరం ఎయిర్​ ఫోర్స్​ యూనిఫాం వేసుకున్న ముర్ము.. 10.15 గంటలకు ప్రచండ్ హెలికాప్టర్​లోని కాక్ పిట్ లో కూర్చుని గ్రూప్  కెప్టెన్ ఎన్ఎస్  బహువాతో కలిసి ప్రయాణించారు. 

25 ని మిషాల పాటు ఆమె ఏరియల్ రివ్యూ చేశారు. పోఖ్రాన్  ఫీల్డ్  ఫైరింగ్  రేంజ్, చారిత్రక శక్తి స్థల్​తో పాటు పాకిస్తాన్  సరిహద్దు ప్రాంతాలను కూడా పరిశీలించారు. హెలికాప్టర్  నుంచే సెల్యూట్  చేస్తూ కనిపించారు. 

కాగా..2023 ఏప్రిల్ 8న కూడా తేజ్​పూర్  ఎయిర్ బేస్​లోని సుఖోయ్ 30 ఎంకేఐలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు.