- అంబాలా ఎయిర్ బేస్ నుంచి అర గంటపాటు ముర్ము ప్రయాణం
- ఐఏఎఫ్ రఫేల్లో ప్రయాణించిన తొలి ప్రెసిడెంట్గా ఘనత
- ఆపరేషన్ సిందూర్‌లో పట్టుకున్నామని పాక్ ప్రచారం
- చేసుకున్న శివాంగీ సింగ్‌తో కలిసి ఫొటోలు
అంబాలా: ఆపరేషన్ సిందూర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్లను కూల్చామని, స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌ను పట్టుకున్నామంటూ ఫేక్ ప్రచారం చేసుకున్న పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ ఫైటర్ జెట్ లో విహరించారు. ఎయిర్ బేస్‌లో శివాంగి సింగ్‌తో కలిసి ఆమె ఫొటోలు సైతం దిగారు. భారత సాయుధ బలగాలకు కమాండర్ ఇన్ చీఫ్ అయిన రాష్ట్రపతి ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు.
ఎయిర్ ఫోర్స్ పైలట్లతోపాటు యాంటీ గ్రావిటీ డ్రెస్ ధరించి రఫేల్ జెట్ లో అరగంట పాటు ప్రయాణించారు. అంబాలా ఎయిర్ బేస్ నుంచి ఉదయం 11.27 గంటలకు రాష్ట్రపతితోపాటు 17వ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహానీ రఫేల్ జెట్‌తో టేకాఫ్ అయ్యారు. గరిష్టంగా గంటకు 700 కిలోమీటర్ల స్పీడ్ తో, సముద్రమట్టానికి అత్యధికంగా 15 వేల అడుగుల ఎత్తులో రఫేల్ ప్రయాణించింది. దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వీరు 30 నిమిషాల తర్వాత తిరిగి ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. అనంతరం విజిటర్స్ బుక్‌లో రాష్ట్రపతి సందేశం రాసి, సంతకం చేశారు. ‘‘రఫేల్లో విహారం మరిచిపోలేని అనుభూతి. ఈ ఫైటర్ జెట్‌లో తొలిసారి ప్రయాణించిన నేను రక్షణ రంగంలో మన దేశ సత్తా పట్ల గర్విస్తున్నాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అభినందనలు” అని ఆమె పేర్కొన్నారు. దీంతో వాయుసేనకు చెందిన రెండు వేర్వేరు ఫైటర్ జెట్లలో ప్రయాణించిన తొలి ప్రెసిడెంట్గా ముర్ము నిలిచారు. ఇంతకుముందు 2023 ఏప్రిల్‌లో ఆమె అస్సాంలోని తేజ్ పూర్ నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ జెట్‌లో విహరించారు. అలాగే రఫేల్ జెట్‌లో ప్రయాణించిన తొలి ప్రెసిడెంట్‌గానూ ముర్ము ఘనత సాధించారు. కాగా, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఇదే ఎయిర్ బేస్ నుంచి మరో ఫైటర్ జెట్‌లో విహరించారు.
శివాంగి సింగ్‌తో కలిసి ఫొటోలు..
అంబాలా ఎయిర్ బేస్ నుంచి రఫేల్ జెట్‌లో విహరించడానికి ముందు రాష్ట్రపతి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. తర్వాత రఫేల్‌లోకి ఎక్కేముందు వాయుసేన రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్, స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలిసి ఫొటోలు దిగారు. తద్వారా ఆపరేషన్ సిందూర్‌లో పట్టుకున్నామని పాక్ చేసుకున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు. కాగా, ముర్ము కంటే ముందు 2006లో అప్పటి ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం, 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోయ్ ఫైటర్ జెట్ లో విహరించారు. దీంతో ఫైటర్ జెట్‌లో విహరించిన మూడో ప్రెసిడెంట్గా, రెండో మహిళా ప్రెసిడెంట్గా కూడా ముర్ము నిలిచారు.
