
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్
ముషీరాబాద్, వెలుగు: ఉద్యమాలకు, పోరాటాలకు ఊపిరి పోసి నిలబెట్టేది పాటేనని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ అన్నారు. మతం మత్తుకు పాట సరైన వ్యాక్సిన్ అని.. తెలంగాణ గడ్డ మత సామరస్యాలకు అడ్డా అని ఆయన చెప్పారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ‘పాటకు జేజేలు’ థీమ్‌తో మూడ్రోజులపాటు జరగనున్న ‘లిటరరీ ఫెస్ట్–2022’ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ మీద జరిగిన రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఆ పోరాటం ఒక మతానికి వ్యతిరేకంగా జరిగిందని చిత్రీకరించే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కవులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు దీన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దానికి పాటే సరైన మార్గమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. పాట ద్వారా జనాల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్, కార్యదర్శి ఆనందాచారి, సినీ నటుడు మాదాల రవి, సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి, సామాజికవేత్త దేవి,కిన్నెరమొగిలయ్య, రాంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.