మహాత్ముడికి జీ20 లీడర్ల నివాళి

మహాత్ముడికి  జీ20 లీడర్ల నివాళి
  • మహాత్ముడికి  జీ20 లీడర్ల నివాళి 
  • రాజ్​ఘాట్​ వద్ద కండువాలు వేసి ఆహ్వానించిన మోదీ

న్యూఢిల్లీ : జీ20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఆదివారం ఉదయం రాజ్​ఘాట్ వెళ్లారు. రెండో రోజు సమిట్ ప్రారంభానికి ముందే రాజ్​ఘాట్​ను సందర్శించి, మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. దీనికి ముందు జీ20 దేశాల లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయబద్ధంగా కండువాలు వేసి రాజ్​ఘాట్​లోకి వెల్​కమ్ చెప్పారు.

భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ అహింసాయుతంగా పోరాడిన తీరుతో పాటు సబర్మతి ఆశ్రమ చరిత్రను జీ20 లీడర్లకు మోదీ వివరించారు. వర్షం పడుతున్నా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్​తో పాటు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ రాజ్ ఘాట్ చేరుకుని జాతిపితకు శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తర్వాత పీస్ వాల్​పై అధ్యక్షులు, ప్రధానులు సంతకాలు చేశారు. ఆపై తిరిగి భారత్ మండపానికి వెళ్లిపోయారు. ‘ఐకానిక్ రాజ్​ఘాట్​లో జీ20 ఫ్యామిలీ మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. జాతిపిత పాటించిన శాంతి, సేవ, కరుణ, అహింస మార్గాలను జీ20 లీడర్లకు వివరించాను. గాంధీజీ ఆదర్శాలు.. సామరస్యపూర్వకమైన, సుసంపన్నమైన ప్రపంచ భవిష్యత్తు కోసం ఎంతో తోడ్పడుతాయి” అని మోదీ ట్వీట్​చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

చెప్పుల్లేకుండా నడిచిన మోదీ, ట్రూడో

ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్​లర్ ఓలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూకే ప్రధాని రిషి సునాక్​తో పాటు కొంతమంది జీ20 లీడర్లు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు చెప్పులు లేకుండా రాజ్​ఘాట్​లో నడిచారు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో పాటు పలువురు రాజ్​ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన స్పెషల్ స్లిప్పర్స్, ఓవర్​షూలు వేసుకున్నారు.