SA20: నలుగురు డకౌట్లు.. 7 పరుగులకే 5 వికెట్లు.. అయినా మ్యాచ్ గెలిచి సంచలనం

SA20: నలుగురు డకౌట్లు.. 7 పరుగులకే 5 వికెట్లు.. అయినా మ్యాచ్ గెలిచి సంచలనం

మొదట బ్యాటింగ్ చేసిన ఒక జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోతే.. ఆ జట్టు మ్యాచ్ గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా.. నలుగురు ప్రధాన డకౌట్స్ కావడంతో పాటు 7 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరితే ఆ జట్టు పరిస్థితి అప్పుడే విజయంపై ఆశలు ఉండవు. కానీ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో అద్భుతం జరిగింది. శనివారం (జనవరి 17) సౌతాఫ్రికా లీగ్ టీ20 లో భాగంగా జోబర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ కు ఘోరమైన ఆరంభం లభించింది. చూస్తూ ఉండగానే 7 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లను కోల్పోయి దిక్కితోచని స్థితిలో నిలిచింది. 

డేనియల్ వొరాల్,నాండ్రే బర్గర్,వియాన్ ముల్డర్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ప్రిటోరియా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. షాయ్ హోప్ నాలుగు పరుగులే చేసి ఔట్ కాగా.. ఆ తర్వాత బ్రైస్ పార్సన్స్, కానర్ ఎస్టర్హుయిజెన్, రోస్టన్ చేజ్, ఆండ్రీ రస్సెల్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌటయ్యారు. దీంతో ప్రిటోరియా 7 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్,షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ జట్టును నిలబెట్టారు. ఎలాంటి భారీ షాట్స్ కు వెళ్లకుండా జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత బ్యాట్ ఝులిపించి హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

Also Read : నలుగురు డకౌట్లు.. 7 పరుగులకే 5 వికెట్లు..

ఆరో వికెట్ కు బ్రెవిస్, రూథర్‌ఫోర్డ్ 103 పరుగులు జోడించి ప్రిటోరియాకు ఫైటింగ్ టోటల్ అందించారు. వీరిద్దరి హాఫ్ సెంచరీలతో మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 144 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ అనూహ్యంగా మ్యాచ్ ఓడిపోయింది. క్యాపిటల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. డయాన్ ఫారెస్టర్ 44 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. కేశవ్ మహారాజ్, లిజాద్ విలియమ్స్ చెరో మూడు వికెట్లు తీసి  విజయంలో కీలక పాత్ర పోషించారు.