
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ఆర్ట్ మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. మోనాలిసా చిత్రం ఉన్న లూవ్ర్ మ్యూజియంలో దుండగులు చొరబడి నిమిషాల వ్యవధిలో నెపోలియన్ కాలానికి చెందిన అత్యంత విలువైన తొమ్మిది నగలను ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై ఫ్రాన్స్దర్యాప్తు ప్రారంభించింది. ఆదివారం ఫ్రాన్స్ కల్చరల్శాఖ మంత్రి రచిడా దాతి మీడియాతో మాట్లాడుతూ చోరీ జరిగిందని తెలిపారు.
ఈ ఘటనలో మ్యూజియం సిబ్బంది ఎవరూ గాయపడలేదని, తాను సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు వివరించారు. ఫ్రాన్స్ ఇంటర్నల్అఫైర్స్మినిస్టర్ లారెంట్ న్యూనెజ్ దీన్ని భారీ చోరీగా పేర్కొన్నారు. దొంగలు వెలకట్టలేని జ్యువెలరీతో పరారయ్యారని చెప్పారు. పారిస్ మేయర్ ఎరియల్ వైల్ మాట్లాడుతూ ‘‘ఇది మాకు పెద్ద షాక్.. మ్యూజియంలో దొంగతనం అంటే ఎదో సినిమాలా అనిపిస్తున్నది’’ అని అన్నారు. ప్యారిస్ ప్రాసిక్యూటర్ ఆఫీసు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు విచారణ చేపట్టింది. అలాగే దర్యాప్తు కూడా కొనసాగుతుండడంతో ప్రస్తుతం మ్యూజియాన్ని మూసివేశారు.