రూపాయి పతనంతో ధరల మంట.ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు జూమ్‌‌..వంట నూనె,పప్పులు,ఎరువుల ధరలు కూడా

రూపాయి పతనంతో ధరల మంట.ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు జూమ్‌‌..వంట నూనె,పప్పులు,ఎరువుల ధరలు కూడా
  •     ఇంధన ధరలు పైపైకే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం
  •      ఎగుమతిదారులకు లాభమే..ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలూ ఫుల్ ఖుషీ
  •     గత ఏడాది కాలంలో మన కరెన్సీ డాలర్‌‌‌‌‌‌‌‌తో 10 శాతం డౌన్‌‌‌‌

 

న్యూఢిల్లీ: రూపాయి విలువ రోజు రోజుకి దిగజారుతోంది. డాలర్‌‌‌‌‌‌‌‌తో తాజాగా జీవిత కాల కనిష్టమైన 92 కి పడిపోయింది. గత ఏడాది కాలంలో ఏకంగా 10 శాతం పతనమైంది.  రూపాయి పతనం కామన్ మ్యాన్‌‌‌‌పై గుదిబండలా మారింది. టీవీలు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, వాషింగ్ మెషిన్లువంటి హోమ్ అప్లియెన్స్‌‌‌‌ల ధరలు గత ఆరు నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్య కార్లు, ఇతర బండ్ల ధరలు కూడా పెరగడం చూశాం.  ప్రభుత్వం కంట్రోల్ చేయడంతో  పెట్రోల్‌‌‌‌, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు.  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ ట్యాక్స్‌‌‌‌లను తగ్గించడంతో వీటి ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ, 85 శాతం అవసరాలకు దిగుమతులపై ఆధారపడడంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే  ప్రజల ప్రయాణ ఖర్చులు మరింత పెరుగుతాయి.  రవాణా ఖరీదైతే ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే అవకాశం ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 0.3 శాతం ఉంటే డిసెంబర్‌‌‌‌‌‌‌‌కి 1.3 శాతానికి పెరిగింది కూడా.

కామన్‌‌‌‌ మ్యాన్‌‌‌‌పై భారం..ఇంధన ధరల్లో పెరుగుదల..

    ఇండియా తన 85 శాతం క్రూడాయిల్ అవసరాలను  దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది.   కరెన్సీ విలువ పడడంతో సేమ్ క్వాంటిటీకే ఎక్కువ రూపాయిలు  చెల్లించాల్సి వస్తోంది. దీంతో  ఇంధన ధరలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో (జులై 2025– జనవరి  2026) మధ్య వంట గ్యాస్ (ఎల్‌‌‌‌పీజీ) ధర సిలిండర్‌‌‌‌ (14.2 కేజీల) ‌‌‌‌కి రూ. రూ.50 నుంచి రూ.70 వరకు పెరిగి దాదాపు రూ.950 కి చేరుకుంది. అంతర్జాతీయంగా ఎల్‌‌‌‌పీజీ ధరలు పెరగడం,  రూపాయం పతనమే ఇందుకు కారణం. వంట గ్యాస్ ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నియంత్రిస్తున్నాయి. దీంతో వీటి ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు లేవు. కానీ, హోటల్స్ వాడే కమర్షియల్ ఎల్‌‌‌‌పీజీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 

  •     విమాన ఇంధన ధరలు గత ఆరు నెలల్లో 12–15 శాతం పెరిగాయి. దీంతో విమాన ప్రయాణాలు ఖరీదుగా మారాయి. నేచురల్ గ్యాస్ (ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ) ధరలు సుమారు 7–10 శాతం ఎగిశాయి.
  •     ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నియంత్రణలతో పెట్రోల్ ధర లీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.94–107 మధ్య, డీజిల్ ధరలు రూ.87–92 మధ్య స్థిరంగా ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్  రేట్లు పెరుగుతూనే..

టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారు చేయడానికి విదేశాల నుంచి ముడిసరుకులను కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకోసం తమ దగ్గర ఉన్న రూపాయిలను డాలర్లలోకి మార్చి పేమెంట్స్ చేస్తాయి. రూపాయి పతనంతో ఎక్కువ రూపాయిలను  కంపెనీలు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా వస్తువుల ధరలను పెంచుతున్నాయి. గత ఆరు నెలల్లో టీవీల ధరలు 5–8 శాతం పెరిగాయి. టీవీ ప్యానెల్స్‌‌‌‌, చిప్స్ ఖరీదుగా మారడమే ఇందుకు కారణం. బ్యాటరీలు, ప్రాసెసర్లు, డిస్‌‌‌‌ప్లేల ధరలు పెరగడంతో మొబైల్ ఫోన్ల రేట్లు 7–10 శాతం ఎగిశాయి. ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, ట్యాబ్లెట్ల ధరలు 6–9 శాతం,  ఏసీలు, ఫ్రిడ్జ్‌‌‌‌లు వంటి హోమ్ అప్లియెన్స్‌‌‌‌ల ధరలు 4–6 శాతం పెరిగాయి. 

ఆహారం అదే బాట..

పామాయిల్‌‌‌‌, సోయా ఆయిల్‌‌‌‌, సన్‌‌‌‌ఫ్లవర్ వంటి వంట నూనెలు, కందిపప్పు, చనా వంటి పప్పులు, యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులను ఇండియా భారీగా దిగుమతి చేసుకుంటోంది. రూపాయి పతనంతో గత ఆరు నెలల్లో వంట నూనె ధరలు 8–12 శాతం పెరిగాయి. పప్పుల ధరలు 6–9 శాతం, ఎరువుల ధరలు 10–15 శాతం ఎగిశాయి.  వంట నూనె, పప్పులు ధరలు పెరగడంతో ప్రజల  రోజువారీ ఆహార ఖర్చు పెరుగుతోంది. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయ ఖర్చు పెరిగి, పంటల ధరలు కూడా పెరుగుతున్నాయి.  

కష్టంగా విదేశీ ప్రయాణం

విదేశాలకు వెళ్లేవారు ఒక్కో డాలర్‌‌‌‌‌‌‌‌కి ఎక్కువ రూపాయిలు చెల్లించాలి. దీంతో టికెట్లు, హోటల్ ఖర్చులు పెరిగాయి. గత ఆరు నెలల్లో రూపాయి విలువ 3.2 శాతం పతనమైంది. దీంతో టికెట్లు, హోటళ్లు, షాపింగ్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ వంటి ప్రయాణ ఖర్చులు 10–15 శాతం పెరిగాయి. వీసా ఫీజులు, టికెట్లు, హోటళ్ల కోసం  డాలర్లలో చెల్లించాలి. రూపాయి పతనంతో వీటి ధరలు డైరెక్ట్‌‌‌‌గా పెరిగాయి. విదేశీ ప్రయాణాలు ఖరీదు కావడంతో చివరి నిమిషం ప్రయాణాలు భారీగా రద్దయ్యాయి. 

విదేశీ విద్య కాస్ట్లీ

రూపాయి పతనంతో విదేశీ విద్య చాలా మందికి కలగా మిగిలిపోతోంది. ముఖ్యంగా  అమెరికా, యూకే, కెనడాలో చదవడం కష్టంగా మారింది.    డాలర్‌‌‌‌‌‌‌‌తో రూపాయి 92 కి జారిపోవడంతో అమెరికాలో ట్యూషన్ ఫీజులు, లివింగ్ ఖర్చులు గత ఆరు నెలల్లో 15–20 శాతం పెరిగాయి. సెమిస్టర్‌‌‌‌ ట్యూషన్ ఫీజు రూ.41.8 లక్షల నుంచి రూ.46 లక్షలకు చేరుకుంది.  యూకే, కెనడాలో చదువుల ఖర్చులు 15 శాతం వరకు పెరిగాయి.

బంగారం కొనలేకపోతున్నాం..

రూపాయి పతనం వలన కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో   గోల్డ్‌‌‌‌ ధరలు  21 శాతం, వెండి ధరలు 129 శాతం మేర పెరిగాయి. దీంతో గోల్డ్ ధర హైదరాబాద్‌‌‌‌లో 10 గ్రాములకు (24 క్యారెట్లకు) రూ.1.65 లక్షలకు చేరుకుంది. వెండి ధర కేజీకి రూ.3.60 లక్షలు పలుకుతోంది.

ఎందుకు పడుతోందంటే? 

  •     రూపాయి పతనానికి కారణం ఒకవైపు డాలర్ బలపడడం,  మరోవైపు గ్లోబల్‌‌‌‌గా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు. అమెరికా ఫెడ్ ఇంకా 3.50 శాతం నుంచి 3.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 2025లో మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గించినా,  ఈ ఏడాది తగ్గించమనే సంకేతాలను ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు ఇండియా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్ల నుంచి డబ్బులను (డాలర్లను) తీసేసి అమెరికా బాండ్లలో, డాలర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.  అమెరికా ట్రెజరీ 10 ఏళ్లు బాండ్ 4.25 శాతం వడ్డీ ఇస్తోంది. దీంతో సేఫ్టీ కోసం వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. ఇండియా 6.50 వడ్డీ ఇస్తున్నా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల వైపు చూస్తున్నారు.
  •     స్టాక్ మార్కెట్లలో భారీగా లాభాలు సంపాదించిన విదేశీ ఇన్వెస్టర్లు, ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో  లాభాలను బుక్ చేస్తున్నారు. సిల్వర్‌‌‌‌‌‌‌‌, గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. భారత్ మార్కెట్లు ప్రస్తుత లెవెల్స్‌‌‌‌ దగ్గర ఆకర్షణీయంగా కనిపించడం లేదు.
  •     ఇండియా వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్‌‌‌‌ వేస్తోంది.  దీంతో అమెరికాకు భారత ఎగుమతులు పడిపోతున్నాయి. దీంతో ఇండియాపై  విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం తగ్గుతోంది.

వీరికి లాభమే.. 

  •     రూపాయి పతనంతో  ఎగుమతిదారులకు లాభమే. వీరు విదేశాలకు వస్తువులను అమ్మి, డాలర్లను పొందుతారు. డాలర్ బలపడితే ఎక్కువ రూపాయిలు పొందొచ్చు. టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌, ఐటీ సర్వీస్‌‌‌‌లు, ఫార్మా, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలకు ఎక్కువ లాభం. 
  •     ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు ఇండియాలోని తమ ఫ్యామిలీస్‌‌‌‌ కోసం డాలర్లు వంటి విదేశీ కరెన్సీ పంపుతారు. వీరి కుటుంబాలు ఎక్కువ రూపాయిలను పొందడానికి వీలుంటుంది.  ఉదాహరణకు 2025 ప్రారంభంలో వెయ్యి డాలర్లు పంపింతే రూ.83 వేలు అందితే, ఇప్పుడు సేమ్ రూ.92 వేలు  అందుతున్నాయి.
  •     టూరిజం రంగం కూడా రూపాయి పతనంతో లాభపడనుంది. విదేశీ పర్యాటకులు తమ డాలర్లను ఎక్కువ రూపాయిలకు  మార్చుకోవచ్చు. దీంతో  భారత్ వారికి చవకగా మారుతుంది. టూరిజం రంగం బలపడుతుంది. 
  •     మన కరెన్సీ పడడం వలన ముడి సరుకుల కోసం దిగుమతులపై ఆధారపడే వారు ఖర్చులను తగ్గించుకునేందుకు లోకల్‌‌‌‌గా సేకరణ పెంచొచ్చు. దీంతో ఇండియాలో ఎకోసిస్టమ్ బలపడుతుంది. కానీ, చాలా ఎలక్ట్రానిక్స్‌‌‌‌, ఫార్మా ముడి  సరుకుల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది.