
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం సాధించిన ప్రగతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. మొజాంబిక్ దేశంలో అక్కడి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాటియస్ మగాలాతో కలిసి మాపుటో నుంచి మచావా వరకు 'మేడ్ ఇన్ ఇండియా' ట్రైన్లో ప్రయాణించడం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ట్వీట్‌పై ఆదివారం మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చొరవను ప్రధాని మెచ్చుకున్నారు. జైశంకర్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, "ఇది ప్రతి ఇండియన్ని సంతోషపరుస్తుంది. మేక్ ఇన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా పురోగతిని కొనసాగిస్తోంది" అని పేర్కొన్నారు.
ప్రధాని శనివారం విదర్భ ప్రాంతంలో ప్రారంభించిన ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)లపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. "విదర్భ ప్రాంతంలో గొప్ప కనెక్టివిటీ" అని ట్వీట్ చేశారు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో జరిగిన ఎస్సీవో మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్‌ను మోడీ ప్రశంసించారు. జల్గావ్ జోవర్, నాగ్‌పూర్ బజ్రా, ఔరంగాబాద్ రాగి ఎస్సీవో మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ రూపంలో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌కు చేరుకున్నాయని స్థానిక ఎంపీ మనోజ్ కోటక్ ట్వీట్ చేయగా.. "ముంబైలో శ్రీ అన్న స్కీమ్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం" అని మోడీ మెచ్చుకున్నారు. కాశీ విశ్వనాథ్, బిహు ఉత్సవాలపై పౌరులు చేసిన ట్వీట్లపైనా ప్రధాని మోడీ స్పందించారు.