
బెంగళూరు: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశం మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించే దిశగా వేగంగా పరుగులు పెడుతోందన్నారు. ‘రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ (సంస్కరణ, నిర్వహణ, రూపాంతరం)’ అనే మూడు అంశాల స్ఫూర్తితోనే మనం ఈ వేగాన్ని అందుకోగలిగామని చెప్పారు. ఇండియాది డెడ్ ఎకానమీ అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కామెంట్లు చేసిన నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం బెంగళూరులో 3 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను, మెట్రో రైల్ యెల్లో లైన్‌ను మోదీ ప్రారంభించారు.
అనంతరం బెంగళూర్ మెట్రో ఫేజ్3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్ డీ కుమారస్వామి, అశ్వినీ వైష్ణవ్, వి. సోమణ్ణ, శోభా కరంద్లాజే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత 11 ఏండ్లలో భారత ఎకానమీ ప్రపంచంలోనే 10వ స్థానం నుంచి టాప్ 5 స్థానానికి చేరిందన్నారు. ఇప్పుడు టాప్ 3 స్థానం చేరడానికి పరుగులు పెడుతోందన్నారు.
11 ఏండ్లలో ఎంతో అభివృద్ధి..
దేశవ్యాప్తంగా 2014 నాటికి కేవలం 5 సిటీల్లో మాత్రమే మెట్రో రైల్ సర్వీసులు ఉండగా.. నేడు 24 సిటీల్లో 1,000కిపైగా కిలోమీటర్లకు మెట్రో రైల్ నెట్ వర్క్ ఏర్పడిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం మెట్రో నెట్ వర్క్‌లో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ 2014 వరకూ దేశంలో 20 వేల కిలోమీటర్ల రైల్ నెట్ వర్క్ మాత్రమే ఎలక్ట్రిఫైడ్ అయిందని, కానీ గత 11 ఏండ్లలో ఇది 40 వేల కిలోమీటర్లకు పెరిగిందన్నారు. అలాగే 2014లో దేశంలో 74 ఎయిర్ పోర్టులు ఉండగా.. ఇప్పుడు 160కిపైగా ఎయిర్ పోర్టులు ఉన్నాయన్నారు.
నేషనల్ వాటర్ వేస్ కూడా 3 నుంచి 30కి పెరిగాయని తెలిపారు. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రధాని చెప్పారు. ‘‘2014కు ముందు మన ఎగుమతులు 468 బిలియన్ డాలర్లుగా ఉండగా.. నేడు అది 824 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్ హ్యాండ్ సెట్ల ఎగుమతుల్లో టాప్ 5లో ఉన్నాం. మన ఎలక్ట్రానిక్ ఎక్స్ పోర్టులు 6 బిలియన్ డాలర్ల నుంచి 38 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఆటోమొబైల్ ఎగుమతులు కూడా 16 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపు అయి, టాప్ 4 దేశాల్లో ఒకటిగా అవతరించాం” అని ప్రధాని వివరించారు.
రూ.15 వేల కోట్లతో మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్ట్..
ప్రధాని శంకుస్థాపన చేసిన బెంగళూరు మెట్రో రైల్ ఫేజ్3 ప్రాజెక్టును రూ.15,610 కోట్ల వ్యయంతో చేపట్టారు. ప్రాజెక్టులో ఆరెంజ్ లైన్‌గా అభివర్ణిస్తున్న ఈ మార్గం 31 స్టేషన్లతో 44 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. ఫేజ్ 3లో భాగంగా జేపీ నగర్ నుంచి కెంపపుర వరకు 32.15 కి.మీ., హోసహళ్లి నుంచి కదబగెరె వరకూ 12.5 కి.మీ. మేరకు నిర్మాణం కానుంది. ప్రధాని ఆదివారం ప్రారంభించిన వందే భారత్ ట్రెయిన్ బెంగళూరు నుంచి బెళగావి వరకు ప్రయాణించనుంది. శ్రీమాతా వైష్ణోదేవి(కత్రా)- అమృత్ సర్, అజ్నీ (నాగపూర్)- పుణె వందే భారత్ ట్రెయిన్లను కూడా ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు.
కేంద్ర నిధులు20 శాతమే: డీకే
బెంగళూరులోని యెల్లో లైన్ మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయంలో కేవలం 20% నిధులే కేంద్రం ఇచ్చిందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇందులో 80% నిధులను రాష్ట్రమే సమకూర్చిందని, కేంద్రం పాత్ర నామమాత్రమేనని చెప్పారు. ప్రధాని పదవి మీద గౌరవంతోనే ఈ ప్రాజెక్టును ఆవిష్కరించాలని కోరామని చెప్పారు. మెట్రోకు 50% నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం కొన్నిచోట్ల 11 % నిధులే ఇచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయంలో మన టెక్నాలజీ
పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొన్ని గంటల్లోనే విజయవంతం కావడం వెనక ఇండియన్ టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియా కీలక పాత్ర పోషించాయని ప్రధాని మోదీ చెప్పారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి టెర్రర్ స్థావరాలను ధ్వంసం చేయడంతో భారత్ సరికొత్త రూపాన్ని ప్రపంచం తొలిసారిగా చూసిందన్నారు. ఈ విజయం వెనక బెంగళూరు, ఇక్కడి యువత కృషి కూడా ఎంతో ఉందని కొనియాడారు.